రాజకీయంగా కొన్ని కీలక ప్రాంతాలు, సిటీలు, నియోజకవర్గాలపై అన్ని పార్టీలకు చెందిన వారికి కన్ను ఉంటుంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి పెద్ద సిటీల్లో ఉండే నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు తమ పట్టు కోసం అన్ని పార్టీలకు చెందిన వారు కాచుకుని ఉంటారు. అక్కడ ఎవరైనా బలంగా పాతుకుపోతున్నారు అంటే పొజిషన్‌లో, అపొజిషనల్‌లో వాళ్లకు సుతరామూ ఇష్టం ఉండదు. తమకు రాజకీయంగా భవిష్యత్తులో ఇక నూకలు చెల్లిపోతాయేమో అన్న ఆందోళన సహజంగానే వారిని వెంటాడుతుంది. ఇప్పుడు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోనూ ఇదే జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు వరకు ఓ సాధారణ మహిళగా ఉన్న గల్లా మాధవికి అనూహ్యంగా సామాజిక సమీకరణలు కలిసి వచ్చి ఎమ్మెల్యే సీటు దక్కింది. బీసీ రజక సామాజిక వర్గానికి చెందిన మహిళ అయిన మాధవికి పార్టీకి పట్టున్న గుంటూరు సీటు ఇవ్వడం పార్టీలోనే కొందరికి రుచించికపోవచ్చు. అటు వైసీపీ నుంచి కూడా బీసీ మహిళగాను.. మంత్రిగాను విడదల రజనీ పోటీలో ఉన్నారు. ఆర్థిక, అంగ బలాల్లోనూ రజనీ ముందు గల్లా మాధవి ఏ మాత్రం పోటీకి రాదని హేళన చేశారు. వాళ్లందరి మైండ్ బ్లాక్ అయ్యేలా 53 వేల ఓట్ల భారీ మెజార్టీతో సంచలన విజయం సాధించారు.
గుంటూరు వెస్ట్ టీడీపీ కంచుకోట. ఇక్కడ వైసీపీలో లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, కావటి మనోహర్‌నాయుడు ఇలా మంది కన్నేసి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు కాచుకుని ఉన్నా ఆయన కూడా పట్టుచిక్కక పడరాని పాట్లు పడుతున్నారు. టీడీపీ కూడా 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించింది. గెలిచిన నేతలు రెండుసార్లు తమ దారి తాము చూసుకున్నా పార్టీని నమ్ముకున్న కేడర్‌కు న్యాయం చేసే దిశగా గల్లా మాధవి అడుగులు వేస్తున్నారు. ఇక్కడ ఏ ఎమ్మెల్యే.. ఏ పార్టీ నుంచి గెలిచినా.. సాధారణ ప్రజలకు దూరంగా హైఫై పొలిటికల్ లీడర్లుగా ప్రవర్తించేవారు. కానీ ఆ పాలనకు మాధవి పూర్తి భిన్నంగా అడుగులు వేస్తున్నారు. స్కూటీ మాద వెళుతూ ఎప్పటికప్పుడు డివిజన్లలో కలియదిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేలా అధికారులను గైడ్ చేస్తూ ఓ సాధారణ మహిళ ఎమ్మెల్యే అయితే సాధారణ ప్రజలకు పాలన ఎంత దగ్గరగా ఉంటుందో చూపిస్తూ ప్రశంసలు పొందుతున్నారు.
జనాల్లోకి ఇంతలా దూసుకుపోతూ వెస్ట్‌లో పాతుకుపోతోన్న మాధవి అంటేనే సహజంగానే కొందరు రాజకీయ నేతలకు కంటగింపుగా మారిపోయారు. ఆమె ఇక్కడ పాతుకుపోతుంటే వెస్ట్ లాంటి ప్రతిష్టాత్మక సీటులో రాజకీయంగా తమ ఎత్తుగడలు ఫలించవని.. తమ పాచికలు పారవని భావించిన కొందరు ఆమెను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఆమె భర్త గల్లా రామంచద్రరావు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, హాస్పటల్స్‌పై రకరకాల నిందలు వేయడం మొదలు పెట్టారు. వాస్తవానికి గల్లా రామచంద్రరావు కుటుంబం రాజకీయాల్లోకి రాకముందు కొన్నేళ్ల నుంచే రియల్ ఎస్టేట్, హాస్పటల్స్ వ్యాపారాల్లో ఉన్నారు. అటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుండి వస్తున్నారు. ఇప్పుడు మాధవి ఎమ్మెల్యే అయ్యాక వ్యాపారాలు, హాస్పటల్స్ అంటూ కొత్త విమర్శలు మొదలయ్యాయి.
ఎమ్మెల్యే అయిన యేడాదిన్నర కాలంలో ఇటు నియోజకవర్గంలోనూ.. అటు అసెంబ్లీలోనూ తనదైన వేసుకున్నారు మాధవి. మరీ ముఖ్యంగా రజక జాతి చిరకాల కోరిక అయిన వారిని ఎస్సీల్లో చేర్చే అంశంపై తనదైన వాగ్దాటిని ఎప్పటికప్పుడు వినిపిస్తూ అసెంబ్లీ వేదికగా కూడా ఆ గళం వినిపించారు. అటు ఇప్పటి వరకు రజక సామాజిక వర్గంకు ఏ పార్టీ కూడా చట్టసభల పరంగా నవ్యాంధ్రలో అవకాశం ఇవ్వలేదు.. రాజకీయంగా వారు తమ గోడు వెల్లబోసుకునేందుకు ఒక్క నాయకుడు కూడా ఉండేవాడే కాదు. టీడీపీ దువ్వారపు రామారావుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడమే కాదు.. ఇటు అదే రజక వర్గం మహిళ మాధవికి అత్యంత ప్రతిష్టాత్మకమైన గుంటూరు సీటు ఇచ్చి ఎమ్మెల్యేను చేసింది. మాధవికి పార్టీ ఇచ్చిన అవకాశంతో రజక సామాజిక వర్గం కూడా తెలుగుదేశం వైపు ఆశలు, అవకాశాల కోసం ఈగర్‌గా ఎదురు చూపులు చూస్తోంది.
అటు బీసీ + మహిళా కోటాలతో పాటు రజక కమ్యూనిటీలో మరింత మంచి అవకాశం రేసులోనూ మాధవి ఉన్నారు. ఈ టైంలో కావాలని మాధవి టార్గెట్‌గా దుష్ప్రచారంతో పాటు టార్గెట్ మొదలైంది. దీని వెనక జెండా, ఎజెండా ఏంటనేది మాధవి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆచితూచి అడుగులు వేయాలి. రాజకీయంగా జనాలకు మంచి చేయడం.. సాధారణ మహిళగా జనాల్లోకి వెళ్లడమే కాదు.. ఎత్తులు, పై ఎత్తులు వేయాలి... ఈ వ్యూహం లేకపోతే రాజకీయ క్షేత్రంలో ఆమెకు ఇబ్బందులు తప్పవు. అసలే గుంటూరు వెస్ట్ యమా హాటు సీటు.. ఇక్కడ ఖర్చీఫ్ కోసం చాలా మంది కాచుకుని ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి