ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో ఫ్రంట్ (తృతీయ పక్షం) అవసరమా? అవకాశం ఉందా? అనే చర్చ ఇప్పుడు సరికొత్తగా తెరమీదకు వస్తోంది. ఈ అంశం పాతదే అయినా, ప్రతిసారి రాజకీయ పరిస్థితులు మారినప్పుడు మళ్లీ చర్చ వేడెక్కుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ వ్యాక్యూమ్, ఎన్నికల సమయంలో తటస్థంగా ఉండే ఓటర్ల శాతం వంటి అంశాలు ఈ చర్చకు కొత్త ఊపునిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఏపీలో బలంగా ఎదిగి నిలబడిన కొత్త పార్టీ అనుకుంటే, జనసేన తప్ప మరొకటి కనిపించడం లేదు. 2019కి ముందు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ “జై భారత్” పేరుతో పార్టీ ప్రకటించినా, ఆశించిన ప్రజామోదం దక్కలేదు. 2014లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి “సమైక్యాంధ్ర” పేరుతో పార్టీ పెట్టినా, ఎన్నికల్లో ఫలితం రాలేదు. అంతకుముందు లోక్‌సత్తా వంటి పార్టీలు మంచి ఆదరణ, ఆశయం ఉన్నా, ఓటు బ్యాంకును పెంచుకోలేక నిలదొక్కుకోలేదు. అందువల్ల కొత్త పార్టీ వస్తే వెంటనే ప్రభావం చూపుతుందని ఊహించడం కష్టం అయ్యింది.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పటంలో వైఎస్ఆర్‌సీపీ ఒక వైపు, టీడీపీ కూటమి మరోవైపు ఇలా రెండు శక్తులా ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రమే గమనించబడితే, కాంగ్రెస్ మాత్రం విభజన తర్వాత పూర్తిగా బలహీనపడిపోయింది. తెలంగాణలో అధికారం సంపాదించినా, ఏపీలో ఆ జోరు కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ శక్తిగా మూడో పక్షం ప్రవేశం లేదా ఎదుగుదలపై చర్చ రావడం సహజమే. విశ్లేషకుల అంచనా ప్రకారం, ఏపీలో సుమారు 18-20 శాతం వరకు తటస్థ, పార్టీ లేని, వ్యక్తి ఆధారిత ఓటర్లు ఉన్నారు. వీరు ప్రస్తుత పార్టీలతో అసంతృప్తిగా ఉండడం లేదా ప్రత్యామ్నాయ నాయకత్వం కావాలనే కోరిక వల్ల కొత్త పార్టీలపై చూపు పెడతారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ కూడా కేవలం ఒక ఎన్నికలోనే 22 శాతం ఓటు షేర్ సంపాదించింది. ఇది అప్పట్లో ఉన్న రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ప్రతిబింబించింది.
నేటి రాజకీయ పరిస్థుతుల్లో కూడా అలాంటి అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు ప్రధాన పార్టీలపై ఉన్న అసంతృప్తి, మార్పు కోరిక, ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త ముఖాల అవసరం ఇవన్నీ మూడో ఫ్రంట్‌కు తలుపులు తెరవగల అంశాలు. అయితే కొత్త పార్టీ బలంగా నిలవాలంటే కేవలం భావోద్వేగం లేదా ఒక్క నాయకుడి ఇమేజ్ సరిపోదు. బలమైన క్యాడర్, స్పష్టమైన సిద్ధాంతం, నిరంతర రాజకీయ కార్యాచరణ, ప్రజా నమ్మకం ఇవన్నీ కావాలి. ఏదేమైనా ఏపీలో తృతీయ పక్షానికి అవకాశం ఉన్నా, దాన్ని రాజకీయ శక్తిగా మారుస్తున్న నాయకత్వం, వ్యూహం అత్యంత కీలకం కానున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి