
సాధారణంగా దద్దుర్లు, దురద వంటివి చాలా సాధారణంగా వచ్చే చర్మ సమస్యలు. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా వస్తుంటాయి. అయితే ఇవి వచ్చినప్పుడు చాలా అసౌకర్యంగా ఉండటమే కాకుండా ఇబ్బందిగా అనిపిస్తుంది. సరైన సమయంలో వాటికి చికిత్స చేయకపోతే కొన్నిసార్లు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. దద్దుర్లు వివిధ కారణాల వల్ల రావచ్చు, అవి అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు, వేడి, ఒత్తిడి లేదా కొన్ని రకాల ఆహారాల వల్ల కూడా కావచ్చు. ఈ సమస్యను నివారించడానికి, తగ్గించడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి.
దద్దుర్లను తగ్గించడంలో మందార ఆకులు బాగా పనిచేస్తాయి. మందార ఆకులను పేస్ట్‌లా చేసి దద్దుర్ల మీద రాయడం వల్ల దురద తగ్గుతుంది. లబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కలబంద గుజ్జును దద్దుర్ల మీద రాయడం వల్ల చర్మం చల్లబడి, దురద తగ్గుతుంది. వేప ఆకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. వేప ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ నీటితో స్నానం చేయడం వల్ల దద్దుర్లు తగ్గుతాయి.
స్వచ్ఛమైన కొబ్బరి నూనెను దద్దుర్లపై రాస్తే చర్మానికి తేమ అంది, దురద నుంచి ఉపశమనం లభిస్తుంది ఓట్స్ పిండిని గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద తగ్గుతాయి. ఈ చిట్కాలను పాటించడంతో పాటు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. దద్దుర్లు వచ్చినప్పుడు వాటిని గోకకుండా జాగ్రత్త పడాలి. ఇవి తీవ్రంగా మారితే వైద్య నిపుణుడిని సంప్రదించాలి. ఇవి కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే, వైద్య సలహా ప్రత్యామ్నాయం కాదని గమనించాలి.
తేనెలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. దద్దుర్లపై తేనె రాసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయడం వల్ల దురద తగ్గుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి దద్దుర్ల మీద స్ప్రే చేయడం లేదా దూది సహాయంతో రాయడం వల్ల చర్మంపై ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. కానీ సున్నితమైన చర్మానికి ఇది వాడటం అంత మంచిది కాదు. చర్మంపై దురద ఎక్కువగా ఉన్నప్పుడు, ఒక గుడ్డలో ఐస్ ముక్కలు పెట్టి దద్దుర్ల మీద ఉంచడం వల్ల చర్మం చల్లబడి, దురద నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.