మనిషికి రోజుకు ఎన్ని గంటల నిద్ర అవసరం అనేది ఒక్కొక్కరూ ఒక్కోరకంగా చెబుతుంటారు. నిజానికి ఇదమిద్ధంగా ఇన్ని గంటలు అని చెప్పడం చాలా కష్టం. మౌలికంగా నిద్ర అనేది వారి వారి జీవనశైలి పైనే ఎక్కవగా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎవరికి ఎంత నిద్ర అవసరమనేది శారీరక శ్రమ, మానసిక శ్రమలతో ముడిపడి ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉండేవారికి సహజంగానే ఎక్కువ గంటల నిద్ర అవసరం. దీనికి తోడు ఆహారంగా ఘనపదార్థాల్ని తీసుకుంటున్నారా? ద్రవ పదార్థాల్ని తీసుకుంటున్నారా? అనేది కూడా ముఖ్యమైన అంశం.ఎందుకంటే తినే ఆహార పదార్థాల పౖన కూడా నిద్రా సమయం కొంత ఆధారపడి ఉంటుంది.

 

ఘనపదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో జీర్ణక్రియ పూర్తి కావడానికి ఎక్కువ గంటలు పడుతుంది, ఆ మేరకు శరీరం ఎక్కువ నిద్రను కోరుకుంటుంది. విద్యార్థుల్లో మానసిక శ్రమే ఎక్కువ కాబట్టి ఒక రకంగా, ఆరేడు గంటలకు మించి నిద్ర అవసరం ఉండదు. కాకపోతే బాగా ఎదిగే 15 ఏళ్ల లోపు పిల్లల్లో క ణాల వృద్ధి వేగం ఎక్కువ కాబట్టి, మిగతావారి కన్నా ఒకటి రెండు గంటల నిద్ర అదనంగా అవసరం . ఆహారంలో ఘన పదార్థాల కన్నా ద్రవ పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షల సమయంలో మానసిక ఒత్తిళ్లు పెరిగి కొంతమంది పిల్లలకు నిద్ర సరిగా పట్టకపోవచ్చు.

 

దానిని గమనించి వారి ఆహార పదార్థాల్లో ద్రవ పదార్థాల మోతాదు పెంచాలి. అలా కాకుండా ఘన పదార్థాలే ఎక్కువగా ఇస్తే, జీర్ణక్రియ కుంటుపడుతుంది. దీనివల్ల దగ్గు, జ్వరం, వాంతులు, విరేచనాల వంటి సమస్యలు తలెత్తుతాయి. కావాలని నిద్ర కాలాన్ని తగ్గించుకున్న వారికైనా, నిద్ర పట్టని వారికైనా ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇస్తే అనారోగ్య సమస్యలు అంతగా బాధించవు. అయితే, మానసిక ఒత్తిళ్లతో సతమతమయ్యే పిల్లలకు కూడా ఎక్కువ గంటల నిద్ర అవసరం అవుతాయి. 

 

 

ఎందుకంటే, రకరకాల భయాల వల్ల కొంతమంది పిల్లలకు గాఢ నిద్ర ఉండదు. ఏ చిన్న శబ్దానికైనా మెలకువ వచ్చేస్తుంది. నలువైపులా చూస్తే అందరూ నిద్రపోతుంటారు. పేరెంట్స్‌ను నిద్రలేపడం ఇష్టం లేదా అటూ ఇటూ దొర్లుతూ అలాగే పడుకుని ఉండిపోతారు. ఎక్కువ గంటలు మంచం పైనే ఉన్నట్లు అనిపించినా వాళ్లు నిజంగా నిద్రించే సమయం చాలా తక్కువే ఉంటుంది. అందుకే ఇవన్నీ మనసులో ఉంచుకుని పిల్లలకు ఓ మాట చెప్పాలి. ‘‘అర్థరాత్రి వేళ మెలకువ వచ్చినా, నిద్ర పట్టకపోయినా, ఆకలి వేసినా ఎవరో ఒకరిని త ప్పకుండా నిద్ర లేపాలి. అలా నిద్ర లేపడం వల్ల మాకేమీ ఇబ్బంది ఉండదు’’ అంటూ పిల్లలు చొరవ తీసుకునే అవకాశాన్ని వారికి ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: