అది ఆడవాళ్ల కోసమే నిర్మించుకున్న గ్రామం. ఆ గ్రామం ఆడవాళ్లకు మగవాళ్ల వేధింపులు అస్స‌ల‌ ఉండవు. అత్యాచారాలు, అఘాయిత్యాలు, గృహహింసలు లేనే లేవు. ఎందుకంటే.. ఈ గ్రామంలో మ‌గ‌వాళ్ల‌కి నో ఎంట్రీ. ఈ గ్రామం మహిళల కోసం మహిళలే నిర్మించుకున్నారు. అదే కెన్యాలోని ఉమోజా గ్రామం.  25 ఏళ్ల క్రితం రెబెకా అనే ఓ మహిళ కేవలం ఆడవాళ్ల కోసం మాత్రమే ఈ ఊరు ఏర్పాటు చేసింది. ఈ గ్రామంలోని మహిళలంతా ఇళ్ల నుండి గెంటి వేయబడుతూ, అవమానాలను ఎదుర్కొన్నవారే. 

 

ఆడవాళ్ల కోసమే ప్రత్యేకంగా ఓ ఊరు ఎందుకు ఏర్పాటు చేశారు..? అందులోకి మగవారు రావడానికి ఎందుకు నిరాకరించారు..? అంటే..  ఈ కెన్యా మహిళలు బ్రిటిష్ సైనికులచే ఎన్నో లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ వేధింపులకు గురైన మహిళలను తరువాత భర్తలు విడిచిపెట్టేవారు. దీంతో చాలా మంది ఇళ్లను వదిలి వీధిన పడేవారు. గృహాల నుండి వివిధ వర్గాల నుండి వారు హింసను ఎదుర్కొనేవారు. భర్తల వద్ద కూడా రక్షణ లేక అకృత్యాలకు గురైన వారంతా కలిసి ఇప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. దాని పేరే ఉమోజా గ్రామం. 

 

1990లో ఉమోజా ఊరు నిర్మాణం మొదలుపెట్టారు. ఎన్నోసార్లు పురుషులు ఈ ఊరు మీద దాడి చేసి ఊరు లేకుండా చేయాలని ప్రయత్నించారు. కానీ.. ఆ ఊరి మహిళలంతా ధైర్యంగా పోరాడి ఊరును కాపాడుకున్నారు. అయితే పురుషులు లేని ఈ గ్రామంలో మహిళలు గర్భవతులు ఎలా అవుతున్నారు అని ఆలోచిస్తున్నారా.. పురుషులు ఇక్కడకు ప్రవేశించవచ్చు. కానీ ఇక్కడ నివసించడానికి మాత్రం అనుమతి లేదు. కానీ ఇక్కడ మహిళలకు పుట్టిన మగ పిల్లలు మాత్రం 18 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇక్కడ ఉండవచ్చు. 

 

ఇక ఇక్క‌డ మ‌హిళ‌లు వ్యవసాయం ద్వారా కూరగాయలను ఉత్పత్తి చేయడం, వివిధ రకాల ఆభరణాల తయారీ, వాటిని అమ్మడం ద్వారా జీవనోపాధి సృష్టించుకున్నారు. అంతేకాకుండా.. ఇక్క‌డ అన్ని రకాల సదుపాయాలూ గ్రామంలో ఉన్నాయి. ఎండ, వాన, చలి నుంచి కాపాడుకోడానికి ఇళ్ళు నిర్మించుకున్నారు. పిల్లలు చదువుకోడానికి పాఠశాల కూడా ఏర్పాటు చేసుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: