వేసవి వచ్చిందంటే చాలు పుచ్చకాయల సందడి మొదలవుతుంది. దాహం తీర్చడానికి, శరీరాన్ని చల్లబరచడానికి పుచ్చకాయ ఎంతో మంచిది. అయితే, చాలామంది పుచ్చకాయ తిన్న తరువాత దానిలోని విత్తనాలను పడేస్తారు. కానీ, ఈ చిన్న పుచ్చకాయ విత్తనాలలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు వాటిని వృధా చేయరు. పుచ్చకాయ విత్తనాలు పోషకాల గని అని చెప్పవచ్చు.

పుచ్చకాయ విత్తనాలలో ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్ మరియు విటమిన్ బి కాంప్లెక్స్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ విత్తనాలలో ఉండే మెగ్నీషియం గుండె పనితీరుకు చాలా అవసరం. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే, ఇందులో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

జింక్ అధికంగా ఉండే పుచ్చకాయ విత్తనాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇది శరీరంలో గాయాలు త్వరగా మానడానికి కూడా తోడ్పడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, పుచ్చకాయ విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం.

ఈ విత్తనాలలో ఉండే ప్రోటీన్లు, ఐరన్,  రాగి జుట్టు పెరుగుదలకు మరియు దృఢత్వానికి తోడ్పడతాయి. అలాగే, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పుచ్చకాయ విత్తనాలలో కేలరీలు మరియు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వేయించిన విత్తనాలు మంచి శక్తి వనరుగా పనిచేస్తాయి. వీటిని స్నాక్స్‌గా తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది.

పుచ్చకాయ విత్తనాలను నేరుగా తినడం కన్నా, వాటిని ఎండబెట్టి లేదా వేయించి తినడం మంచిది. లేదా వాటిని పొడి చేసి సలాడ్లు, స్మూతీలు లేదా ఇతర ఆహారపదార్థాలలో కలిపి తీసుకోవచ్చు. పుచ్చకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి దీర్ఘకాలంలో ఎన్నో బెనిఫిట్స్ చేకూరుతాయి. అయితే షుగర్ ఉన్నవాళ్లకు మాత్రం ఇవి మంచివి కాదని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: