అన్నం మన దైనందిన ఆహారంలో ముఖ్యమైన భాగం. అయితే, నెల రోజుల పాటు అన్నం తీసుకోకపోతే మన శరీరంలో కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవించవచ్చు. ఈ మార్పులు వ్యక్తి ఆరోగ్యం, జీవనశైలి, అన్నానికి బదులుగా తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటాయి.

అన్నం ప్రధానంగా కార్బోహైడ్రేట్‌ల (పిండి పదార్థాలు)ను అందిస్తుంది. ఇవి శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. అన్నం మానేసినప్పుడు, శరీరం శక్తి కోసం ఇతర వనరుల వైపు మళ్లుతుంది. ముఖ్యంగా, కొవ్వుల నుండి శక్తిని ఉత్పత్తి చేసే 'కీటోసిస్' ప్రక్రియ ప్రారంభం కావచ్చు. ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

కార్బోహైడ్రేట్‌ల వినియోగాన్ని తగ్గించడం వల్ల, శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరుగుతుంది. అలాగే, కార్బోహైడ్రేట్‌లు నీటిని నిల్వ చేసుకుంటాయి కాబట్టి, వాటిని తగ్గించడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న నీటి బరువు కూడా తగ్గుతుంది. ఫలితంగా, మొదటి కొన్ని వారాల్లో వేగంగా బరువు తగ్గినట్లు అనిపించవచ్చు.

అన్నం రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. దానిని మానేయడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా మధుమేహం (షుగర్) ఉన్నవారికి లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి ప్రయోజనకరం. ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడవచ్చు. అన్నం స్థానంలో అధిక పీచుపదార్థాలు (ఫైబర్) ఉన్న కూరగాయలు, పండ్లు లేదా తృణధాన్యాలు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే, అన్నానికి బదులుగా తగినంత ఫైబర్ తీసుకోకపోతే, జీర్ణక్రియకు సంబంధించిన ఇబ్బందులు పెరగవచ్చు.

కొంతమందిలో మొదట్లో కార్బోహైడ్రేట్‌ల లోపం కారణంగా నీరసం, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీనిని 'కార్బ్ ఫ్లూ' అని కూడా అంటారు. అయితే, శరీరం కొవ్వును శక్తిగా ఉపయోగించడం అలవాటు చేసుకున్న తర్వాత, కొందరిలో శక్తి స్థాయిలు స్థిరంగా పెరిగి, ఏకాగ్రత మెరుగుపడినట్లు కూడా అనుభూతి చెందుతారు. అయితే ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్ళు వైద్యుల సలహాలు తీసుకుని అన్నం తినడం మానేస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: