మసక దృష్టి (Blurred Vision) అనేది చాలా మందికి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే సాధారణ సమస్యే. దృష్టి స్పష్టత తగ్గడం, వస్తువులు అస్పష్టంగా, పొగమంచు పట్టినట్లు కనిపించడం దీని ముఖ్య లక్షణం. ఇది తాత్కాలికంగా లేదా దీర్ఘకాలికంగా ఉండవచ్చు. కారణం ఏదైనా, దృష్టి మసకబారినప్పుడు అజాగ్రత్త చేయకుండా, సరైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
దృష్టి మసకబారినప్పుడు, ముఖ్యంగా మొదటిసారి జరిగితే, ఆందోళన చెందడం సహజం. ముందుగా ప్రశాంతంగా కూర్చోండి లేదా పడుకోండి. కళ్ళకు కొంత విశ్రాంతి ఇవ్వండి. కళ్ళు మసకబారినప్పుడు వాటిని రుద్దడం వల్ల తాత్కాలికంగా కాస్త ఉపశమనం లభించినట్లు అనిపించినా, అది పరిస్థితిని మరింత తీవ్రతరం చేయవచ్చు లేదా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. మీరు వాహనం నడుపుతున్నట్లయితే, వెంటనే సురక్షితమైన ప్రదేశంలో ఆపివేయండి. మసక దృష్టితో డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం.
వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశంలో చదవడం లేదా చూడటం మానేయండి. అవసరమైతే, కళ్ళపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు తగినంత సహజమైన లేదా మృదువైన కాంతిని ఉపయోగించండి. మసక దృష్టికి కొన్ని సాధారణ కారణాలు (కంటి అలసట, తక్కువ నిద్ర) ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఇది తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు. ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే కంటి వైద్యుడిని (Ophthalmologist) సంప్రదించాలి
ఒక కన్ను లేదా రెండు కళ్ళ దృష్టి అకస్మాత్తుగా మసకబారితే లేదా పూర్తిగా పోతే వైద్యులను సంప్రదించాలి. కంటిలో లేదా కంటి చుట్టూ భరించలేని నొప్పి ఉంటే కూడా వైద్యుడిని కలవాలి. మసక దృష్టితో పాటు తీవ్రమైన తలనొప్పి, వికారం లేదా వాంతులు ఉంటే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ప్రతి సంవత్సరం కంటి వైద్యుడి వద్ద పూర్తి పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. చిన్న సమస్యలు ఉన్నా, అవి పెరగకముందే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు.
మీరు ఎక్కువ సమయం కంప్యూటర్ లేదా ఫోన్ ముందు గడుపుతున్నట్లయితే, ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. ఇది కంటి అలసటను తగ్గిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి