2019 ఎన్నికల్లో టీడీపీకి ఎలాంటి ఫలితాలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఐదేళ్లు పాటు అధికారంలో కొనసాగిన టీడీపీ మీద జనంలో వ్యతిరేకిత ఎంత వచ్చిందో, వారికి వచ్చిన సీట్లు బట్టి అర్ధమైపోతుంది. వైసీపీకి 151 సీట్లు కట్టబెడితే, టీడీపీకి కేవలం 23 సీట్లే దక్కాయి. అయితే ఈ 23 మంది ఎమ్మెల్యేల్లో భారీ మెజారిటీ వచ్చిన నేతలు అతి తక్కువ మంది ఉన్నారు. చంద్రబాబుకు కుప్పంలో 30 వేలపైనే మెజారిటీ వస్తే, రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవానికి కూడా 30 వేలు మెజారిటీ వచ్చింది.

 

ఇక వీరిద్దరి తర్వాత టీడీపీలో పెద్ద మెజారిటీ వచ్చింది...విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకే. వైసీపీ అభ్యర్థి అక్రమాని విజయ నిర్మలపై 26 వేలపైనే మెజారిటీతో గెలిచారు. అయితే రామకృష్ణ అంతకముందు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 లో ఇదే స్థానం నుంచి 4 వేల మెజారిటీతో గెలవగా, 2014 లో దాదాపు 48 వేల మెజారిటీతో గెలిచారు.

 

ఇక అప్పుడు ఎలాగో టీడీపీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో బాగానే పనులు చేసారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా పనిచేయడం వల్లే 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నాసరే రామకృష్ణ మాత్రం అదిరిపోయే విజయం అందుకోగలిగారు.

 

అయితే ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం కావడంతో అనుకున్నంత నిధులు అందడం లేదు. అయినా సరే తనకు సాధ్యమైన వరకు నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉంటున్నారు. తన సొంత డబ్బులతో ప్రజలకు నిత్యావసర వస్తువులు లాంటివి అందిస్తున్నారు.

 

కాకపోతే జగన్ విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయనుండటం, ఆ నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించడం వల్ల, రామకృష్ణకు తూర్పు నియోజకవర్గంలో కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉంది. విశాఖ రాజధానికి మద్దతు తెలపాలని అక్కడి ప్రజలు పలుమార్లు రామకృష్ణ ఇంటి ముందు ధర్నాలు కూడా చేసారు. దీంతో రామకృష్ణపై కాస్త వ్యతిరేకిత వచ్చింది.

 

అటు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే...తూర్పు మొత్తం విశాఖ కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఇక విశాఖని రాజధానిగా చేయనుండటం వల్ల, వైసీపీకి అనుకూల వాతావరణం ఉంది. కార్పొరేషన్ ఎక్కువ శాతం వైసీపీ ఖాతాలో పడే అవకాశముంది. మొత్తానికైతే జగన్ మూడు రాజధానుల దెబ్బ రామకృష్ణకు గట్టిగానే తగిలిందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: