ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. పార్టీ పరిస్తితి బాగోకపోవడంతో కాంగ్రెస్ నేతలు టీడీపీ, వైసీపీల్లోకి జంప్ కొట్టేశారు. దాదాపు 90 శాతం నాయకులు కాంగ్రెస్‌ని వదిలేశారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో రాజకీయం చేసిన నాయకులకు జంప్ చేయడం తప్పలేదు. అలా దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన అనంత వెంకట్రామి రెడ్డి సైతం వైసీపీలోకి వచ్చేశారు.


1996, 1998, 2004, 2009ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున అనంతపురం ఎంపీగా గెలిచిన అనంత, 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున అనంతపురం ఎంపీగా పోటీ చేసి, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.  ఆ తర్వాత అనంతపురం వైసీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా, అనంతపురం అర్బన్ సమన్వయకర్తగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి జగన్ వ్యూహం మార్చి..వెంకట్రామిరెడ్డిని అనంతపురం అర్బన్‌ అసెంబ్లీ బరిలో దించారు.


ఆ పోరులో టీడీపీ నేత ప్రభాకర్ చౌదరీపై 28 వేలపైనే ఓట్లతో విజయం సాధించారు. అయితే ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటంతో, అనంత ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనబరుస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు.   ఈ ఏడాది కాలంలోనే ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. రూ. 80 కోట్లతో నియోజకవర్గంలో ఉన్న డ్రైనేజ్ సమస్యకు చెక్ పెట్టారు. ఇక నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పాతూరులోని పాత పోస్టాఫీస్ నుండి తడకలేరు వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు. సీనియర్ నేత కావడంతో నియోజకవర్గంలో మంచిగానే అభివృద్ధి చేస్తున్నారు.


ఇక ఇక్కడ టీడీపీ నేత ప్రభాకర్ చౌదరీ కూడా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. నిత్యం వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. అధినేత పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. కార్యకర్తలని కలుపుకుని పోతూ...పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. కాకపోతే అనంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండటంతో ప్రభాకర్‌కు పుంజుకునే అవకాశం దక్కడం లేదు. అందుకే ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అనంతపురంలో అనంత వైసీపీ జెండా ఎగిరేలా చేశారు. మొత్తం 50 డివిజన్లలో వైసీపీ 48 గెలుచుకుంది. ఇక ఈ విజయంతో అనంత ఎంత బలంగా ఉన్నారో తెలుస్తుంది. అలాగే సీనియర్ నేత కావడంతో నెక్స్ట్ జరగబోయే కేబినెట్ విస్తరణలో మంత్రిగా ఛాన్స్ దక్కే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. మరి జగన్, అనంతకు మంత్రి ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: