రాపాక వరప్రసాద్...జనసేన తరుపున 2019 ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. రాజోలు నుంచి గెలిచిన రాపాక జనసేనలోనే ఉండుంటే వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యేగా ఉండేవారు. కానీ వైసీపీలోకి వెళ్ళి గుంపులో గోవిందా అన్నట్లు అయిపోయారు. అయితే ఇదే విషయాన్ని రాపాక ఎమ్మెల్యేగా గెలిచిన మొదట్లో చెప్పారు. అప్పటిలో చాలా సూక్తులు చెప్పారు. అసలు తాను పార్టీ మారనని మాట్లాడారు. కానీ అనూహ్యంగా అధికారం కోసం ఆశపడ్డారో లేక ఏమన్నా ఇబ్బందులు వస్తాయి అనుకున్నారేమో గానీ రాపాక, వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు.

జగన్‌కు భజన చేయడం, వైసీపీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, వైసీపీ మంత్రులతో చెట్టపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టారు. అసలు పూర్తిగా రాపాక వైసీపీ నాయకుడుగా మారిపోయారు. అయితే వైసీపీ నేతగా మారడం వల్ల రాపాకకు వచ్చింది ఏంటి అంటే అధికారంలో ఉన్నామనే పేరు...కాస్తో కూస్తో నిధులు. కానీ ఇలా పార్టీ మారడం వల్ల రాపాక ఉన్న విలువని పోగొట్టుకున్నారని, అదే జనసేనలో ఉండుంటే ఆ పార్టీ కార్యకర్తలు నెత్తిన పెట్టుకునేవారని విశ్లేషకులు మాట్లాడుతున్నారు.

ఇప్పుడు వైసీపీ వైపుకు వెళ్ళిన రాపాకకు అనుకున్న మేర ప్రాధాన్యత దక్కుతున్నట్లు కనిపించడం లేదు. నియోజకవర్గంలో ప్రభుత్వం తరుపున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తప్ప రాజోలులో కొత్తగా జరిగే కార్యక్రమాలు ఏమి లేవు.  పైగా ఇక్కడ ఇసుక, ఇళ్ల స్థలాల్లో వైసీపీ నేతల అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపణలు వస్తున్నాయి.

ఇక టి‌డి‌పి తరుపున గొల్లపల్లి సూర్యారావు యాక్టివ్‌గానే పనిచేస్తున్నారు. రాజోలు నియోజకవర్గంలో సమస్యలపై బాగానే పోరాటం చేస్తున్నారు. అటు జనసేన కార్యకర్తలు దూకుడుగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎలాగైనా రాపాకని ఓడించాలనే కసితో ఉన్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. కొన్నిచోట్ల టి‌డి‌పితో కలిసి వైసీపీని ఓడించారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీకి చెక్ పెట్టాలని అనుకుంటున్నారు. అటు రాపాకకు వైసీపీ టికెట్ వస్తుందో లేదో గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది వైసీపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అమ్మాజీ, బొంతు రాజేశ్వరరావులు సైతం వైసీపీ నుంచి నిలబడటానికి చూస్తున్నారు. మరి ఈ పరిణామాల మధ్య పార్టీ మారిన రాపాక పోలిటికల్ కెరీర్ ఇబ్బందుల్లో పడినట్లే కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: