దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం సినిమాలంటే త‌మిళ ప్రేక్ష‌కుల‌కెంత అభిమానం ఉందో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా అంతే అభిమానిస్తారు. ఇంకా చెప్పాలంటే ఆయ‌న సినిమాల‌కు తెలుగులోనే ఇంకా ఆద‌ర‌ణ ఎక్కువేమోన‌నిపిస్తుంది. సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌ల‌ను యువ‌త గుండెల‌ను మీటేలా తీయ‌డంలోనైనా, స‌మ‌కాలీన రాజ‌కీయ, సామాజిక అంశాల‌ను, స‌మ‌స్య‌ల‌ను ప్ర‌తిబింబిస్తూ తెర‌కెక్కించే సందేశాత్మ‌క చిత్రాలైనా ఆయ‌న శైలే వేరు. అందుకే భాష‌లు, సంస్కృతుల అడ్డుగోడ‌ల‌ను ఛేదించుకుని ఆయ‌న సినిమాలు అన్ని ప్రాంతాల్లోనూ ఆద‌ర‌ణ పొందాయి. ఈ సృజ‌నాత్మ‌క ద‌ర్శ‌కుడు మూడు ద‌శాబ్దాల క్రితం తెర‌కెక్కించిన చిత్రం రోజా. అర‌వింద‌స్వామి, మ‌ధుబాల హీరో,హీరోయిన్లుగా త‌మిళంలో తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ అద్భుత విజ‌యాన్ని అందుకుంది.
ఎక్క‌డో ఢిల్లీలో ఇంజ‌నీర్‌గా ప‌ని చేసే ఒక యువ‌కుడు త‌న‌కు క‌ల్మ‌షం లేని ప‌ల్లెటూరు అమ్మాయే భార్య‌గా కావాల‌ని కోరుకుని మ‌రీ అలాగే వివాహం చేసుకుంటాడు. ఆమెను తీసుకుని ప‌ట్ట‌ణానికి వెళ్లాక అత‌డికి ఆఫీస్ త‌ర‌పున అత్య‌వ‌స‌రంగా తీవ్ర‌వాదుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న కాశ్మీర్ వెళ్లాల్సిన ప‌ని ప‌డుతుంది. భార్య‌తో స‌హా అక్క‌డ‌కు వెళ‌తాడు. అక్క‌డిదాకా కొత్త దంప‌తుల మ‌ధ్య ఆక‌ట్టుకునే స‌న్నివేశాల‌తో సాగిపోయే చిత్రం అనుకోని మ‌లుపు తిరుగుతోంది. హీరోను ఉగ్ర‌వాదులు కిడ్నాప్ చేస్తారు. అంత‌కుముందు భార‌త సైనికులు ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌ట్టుకున్న ఉగ్ర‌వాద సంస్థ కీల‌క‌నాయ‌కుడిని విడుద‌ల చేయ‌క‌పోతే హీరోను చంపేస్తామ‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తారు. ఇక ఆ ఉగ్ర‌వాదుల నుంచి భ‌ర్త‌ను ర‌క్షించుకునేందుకు అక్క‌డి భాష‌, ప‌రిస్థితులు ఏమీ తెలియ‌ని ఆ ప‌ల్లెటూరి యువ‌తి  అటు ప్రభుత్వం తోనూ, ఇటు ఆర్మీ అధికారుల‌తోనూ చేసిన పోరాటం, అంతిమంగా సాధించిన విజ‌యం ఈ సినిమాలో ప్ర‌ధాన ఇతివృత్తం. ఇంత‌కీ ఈ సినిమా క‌థ‌కు స్ఫూర్తి ఏమిటో తెలుసా..? మ‌న పురాణాల్లో క‌నిపించే స‌తీ సావిత్రి అనే ప‌తివ్రతా శిరోమ‌ణి క‌థనే తీసుకుని మ‌ణిర‌త్నం ఈ స్టోరీ డెవ‌ల‌ప్ చేశార‌ట‌.  ఓ సంద‌ర్భంలో ద‌ర్శ‌కుడు స్వ‌యంగా చెప్పిన విష‌యం ఇది. సావిత్రి త‌న భ‌ర్త ప్రాణాల‌ను కాపాడుకునేందుకు ఆ య‌మ‌ధ‌ర్మ‌రాజుతోనే పోరాడి ఆయ‌న‌ను మెప్పించి త‌న ప‌తిని ర‌క్షించుకుంటుంది. రోజా మూవీలో య‌ముడిని మించిన ఉగ్ర‌వాదుల‌నుంచి ఆ ప‌ల్లెటూరి యువ‌తి త‌న భ‌ర్త‌ను ర‌క్షించుకుంటుంద‌న్న‌మాట‌. ఈ సినిమా బాలీవుడ్‌లోనూ ఘ‌న‌విజ‌యం సాధించ‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: