
ఆయన పేరు గిన్నిస్ బుక్‌లో నమోదు కావాలనీ, ఘంటసాలకు 'భారతరత్న' రావాలనీ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న ఘంటసాల శ్యామల ఆయన శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆవిడతో ప్రత్యేకంగా ముచ్చటించినప్పుడు, 'నవ్య'కు చెప్పిన విశేషాలివి.
మీ నాన్నగారి శత జయంతి సందర్భంగా ఈసారి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు?
'శతాబ్ది గాయకుడు'గా నాన్నగారి గొప్పతనాన్ని చాటుతూ ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలన్నది మా చిన్న అన్నయ్య (రత్నకుమార్) అభిమతం. దాదాపు ప్రతి ఊళ్లో నాన్నగారి పేరిట అభిమాన సంఘాలు ఉన్నాయి. వాళ్లంతా ప్రతి ఏడాది డిసెంబర్ 4న నాన్నగారి జయంతిని ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే శత జయంతి సంవత్సరం సందర్భంగా ఒక్కొక్కరూ ఒక్కో సమయంలో కాకుండా అంతా ఒక మాట అనుకుని ఆ రోజున ఒకే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద వేడుకలు నిర్వహించాలని, అది గిన్నిస్ బుక్ దృష్టికి తీసుకెళ్లాలనే సంకల్పంతో మూడేళ్ల క్రితమే అన్నయ్య నాన్నగారి అభిమాన సంఘాల సభ్యులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. వారందరినీ ఓ తాటి మీదకు తెచ్చాడు. ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. మా వదిన ఈ బాధ్యతను స్వీకరించింది. ఆవిడ నాన్నగారి వీరాభిమాని. ఆయన పాడిన పాటల వివరాలన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయి. ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో నాన్నగారికి 48 విగ్రహాలు ఉన్నాయి. ఇదీ రికార్డే. అలాగే ఆయన పేరిట మూడు గుళ్లు ఉన్నాయి. ఆ గుళ్లలో ఇప్పటికీ ఆయనకు నిత్య పూజలు జరుగుతున్నాయి. మా వదిన ఆ గుళ్లు మూడూ చూసి వచ్చింది. ఒక గాయకుడికి గుడి కట్టి పూజించడం అన్నది కూడా రికార్డే కదా. ఇవన్నీ గిన్నిస్ బుక్ దృష్టికి తీసుకువెళ్లాలని మా సంకల్పం.
నాన్నగారి పేరు చెప్పగానే మీకు గుర్తుకు వచ్చే సంఘటన ఏది?
'మహాకవి కాళిదాసు' చిత్రం కోసం శ్యామలా దండకం పాడిన రెండు రోజులకో, లేక అది పాడడానికి రెండు రోజుల ముందో నేను పుట్టానట. అంతకుముందు పుట్టిన వాళ్లిద్దరూ మగ పిల్లలే. ఆడ పిల్లలు లేకపోవడంతో 'అమ్మవారి అనుగ్రహం వల్ల నాకు కూతురు పుట్టింది' అని నాన్నగారు అన్నారట. 'శ్యామల దండకం' పాడిన తర్వాత పుట్టడం వల్ల నాకు శ్యామల అని పేరు పెట్టారు. ఆ దండకం వింటుంటే ఇప్పటికీ నాకు గూస్ బంప్స్ వస్తుంటాయి. 'శ్యామల దండకం' నిడివి ఎక్కువగా ఉండడంతో రెండు భాగాలుగా రికార్డ్ చేద్దామని సంగీత దర్శకుడు పెండ్యాలగారు అన్నారట. 'కంటిన్యూటీ పోతుంది బాబూ.. ఒకేసారి పాడేస్తాను' అని ఏకబిగువున పాడేసి, తర్వాత పావు గంట సేపు కదలకుండా అలా కూర్చుండి పోయారట. టేక్ ఓకే అయింది కానీ ఘంటసాలగారికి ఏమైనా అయ్యిందేమోనని అందరూ కంగారు పడ్డారట. ఎందుకంటే 'కూర్చుని పాడండి మాస్టారూ' అని పెండ్యాలగారు అన్నా ఆయన వినకుండా 'ఇలాంటి దండకం కూర్చుని పాడకూడదు. ఆ ఫీల్ రాదు' అని నాన్నగారు అలాగే నిలబడి గుక్కు తిప్పుకోకుండా పాడేయడంతో చాలా స్ట్రెయిన్ అయ్యారు. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పాడిన ఆ దండకం ఎంత హిట్ అయిందో చెప్పనక్కర్లేదు.
ఆయన మీతో ఎలా స్పెండ్ చేసేవారు?
రోజూ మేం నిద్రలేచేసరికి నాన్నగారు టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతూ కనిపించేవారు. ఆయనకి ప్రత్యేకంగా ఆఫీసు అంటూ లేకపోవడంతో ఎవరు కలవాలన్నా ఇంటికే వచ్చే వారు. మేం రెడీ అయి, ఆయనకు చెప్పేసి స్కూల్‌కు వెళ్లిపోయేవాళ్లం. డ్రైవర్ మమ్మల్ని స్కూల్లో దించి వచ్చిన తర్వాత ఆ కారులోనే నాన్నగారు రికార్డింగ్ థియేటర్‌కు వెళ్లేవారు. ఇలా నాన్నగారికంటే ముందే మేం బయటకు వెళ్లే వాళ్లం కనుక మిస్ అయ్యామనే భావన ఉండేది కాదు. కాకపోతే మేం నిద్ర పోయిన తర్వాత ఆయన ఇంటికి వచ్చేవారు. పండగలు వస్తే చాలా హ్యాపీగా అందరం జరుపుకొనేవాళ్లం. దీపావళి వస్తే చాలు మా ఇంట్లో బాగా సందడిగా ఉండేది. మతాబులు, చిచ్చుబుడ్లు ఇంట్లోనే తయారు చేయించేవాళ్లు. మొదటి టపాకాయ నాన్నగారే కాల్చాలి. చిచ్చుబుడ్డి కాల్చడానికి కూడా ఆయన చాలా భయపడేవారు. అందులోంచి రవ్వలు పైకి వస్తాయి, పిల్లల మీద పడుతుందేమోనని ఆయన భయం. వీధిలో భూ చక్రం కాల్చి వెంటనే పక్కనే ఉన్న అరుగు ఎక్కమనేవారు నాన్న. అది గిర్రున తిరుగుతుంటే దగ్గర నుంచి చూడకుండా అరుగు ఎక్కమంటారని ఆయన మీద విసుక్కునేవాళ్లం.
ఘంటసాలకు పరిశ్రమలో స్నేహితులు ఎవరు?
వాళ్లకు షూటింగ్ ఉన్నా లేకపోయినా రికార్డింగ్ థియేటర్‌కు వచ్చి రంగారావుగారు, రేలంగి గారు నాన్నగారితో మాట్లాడుతుండేవారు. చాలా సందర్భాల్లో వీరు ముగ్గురే మాట్లాడుకుంటూ కనిపించేవారు. ఇక నాన్నగారి స్నేహితుల్లో ఎన్టీఆర్‌గారు ముఖ్యులు. ఆయన ఇల్లు మా ఇంటికి దగ్గర్లోనే ఉండేది. ఆయన ఏ కార్యక్రమం అనుకున్నా మొదట నాన్నగారి దగ్గరకు వచ్చి సంప్రదించేవారు. అలాగే నాన్నగారు కూడా రామారావుగారి సలహా తీసుకునే వారు. ఇద్దరూ ముందు సంప్రదించుకుని ఓ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆ విషయం మిగిలిన వాళ్లకు చెప్పేవారు. ఆయన 'మాస్టారు' అని పిలిస్తే, ఈయన కూడా 'మాస్టారు' అని పిలిచేవారు. ఒకరు మాస్టారు అయితే మరొకరు స్టూడెంట్ అవ్వాలి కదా కానీ నాన్నగారు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ 'మాస్టారు' అని పిలిచేవారు. వాళ్లు కూడా ఆయన్ని గౌరవంతో 'మాస్టారు' అనే పిలిచేవారు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు 'రామారావు బాబు, నాగేశ్వరరావు బాబు' అని చెప్పేవారు.
చివరి రోజుల్లో చిత్ర పరిశ్రమ ఆయన్ని పట్టించుకోలేదని అంటారు. నిజమేనా?
కాదండీ. ఆయన్ని అతిగా పట్టించుకున్నారు కాబట్టే మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. 'మంచివాడు ' చిత్రం కోసం 'అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలానే ఉంటుంది' అని ఓ పాట పాడారు నాన్నగారు. రేడియోలో పాటలు వింటూ ఇంటి పని చేసుకోవడం అమ్మకు అలవాటు. ఒక రోజు రేడియోలో ఆ పాట వస్తోంది. నాన్నగారు ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు. పేపర్ చదువుకుంటూ యదాలాపంగా ఆ పాట విన్నారు. వెంటనే ' ఆ పాట పాడింది ఎవరు?' అని అడిగారు. మేం తెల్లబోయాం. ఎందుకంటే సుశీలగారితో కలసి ఆ పాట పాడింది నాన్నగారే. తను పాడిన పాటలన్నీ గుర్తు పెట్టుకొనే నాన్నగారు ఈ పాట పాడింది ఎవరూ అని ప్రత్యేకంగా అడుగుతున్నారేమిటి అనుకున్నాం. ' సుశీల గొంతు తెలుస్తూనే ఉంది. ఆ మగ గొంతు ఎవరు' అని నాన్న మళ్లీ అడిగారు. మీరే కదా నాన్న పాడింది అని టక్కున అనేశా. 'నేనా.... అర్ధం పర్థం లేని ఇలాంటి పాట పాడానా.. నేను విద్య నేర్చుకున్నది ఇలాంటి పాటలు పాడడానికి కాదు కదా.. విలువలు పట్టించుకోకుండా డబ్బు పిచ్చిలో పడి ఏవో పాటలు పాడేస్తున్నానా ' అని తెగ ఫీలయి పోయారు. ఇప్పటి పాటలతో పోలిస్తే అది నిజంగా సంసార పక్షమైన పాటే. కానీ నాన్న మాత్రం ఆ రోజంతా అదో రకమైన మూడ్‌లో ఉండి ఎవరితోనూ మాట్లాడలేదు. ఏమనుకున్నారో ఏమో అప్పటి నుంచి 'నేను ఇలాంటి పాటలు పాడను' అని చెప్పడం మొదలు పెట్టారు. ' ఈ రకమైన పాటలు పాడే వయసు అయిపోయింది. నా కంటే చిన్నవాళ్లు రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం బాగా పాడుతున్నారు. వాళ్లతో పాడించండి' అని చెప్పేవారు. ఇలా చాలా పాటలు వదిలేసినా కొంతమంది నిర్మాతలు మాత్రం వదిలిపెట్టలేదు. వాళ్లకీ వీళ్లకి చెప్పి రికమండేషన్ చేయించడంతో కొన్ని పాటలు పాడాల్సి వచ్చింది,
వినాయకరావు
అమెరికాలో ఉన్న డాక్టర్ బాల ఇందుర్తిగారు ఇందుకోసం బాగా కృషి చేస్తున్నారు. సిగ్నేచర్ కాంపెయిన్ కూడా పూర్తయింది. 'ఈ కాంపెయిన్ కోసం మీ కుటుంబం నుంచి ఎవరూ ముందుకు రావడం లేదు' అనే విమర్శ ఉంది. నిజం చెప్పాలంటే నాన్నగారి సిద్ధాంతాలకు ఇలాంటివి విరుద్ధం. ఆ కారణంగానే నేను పర్సనల్ ఇందులో ఇన్వాల్వ్ అవడం లేదు. మా వంతు సహకారాన్ని అందిస్తాం కానీ 'మా నాన్నగారికి భారతరత్న' ఇవ్వండి' అని అడగం. అలా చేస్తే ఆయన గౌరవాన్ని తగ్గించినట్లే. అయితే డాక్యుమెంట్స్ పరంగా ప్రొసెస్ జరగాలంటే కుటుంబ సభ్యుల పాత్ర అవసరం కనుక మా చిన్న వదినను తీసుకుని డాక్టర్ బాలా గారు వెంకయ్యనాయుడుగారినీ, కిషన్ రెడ్డిగారిని కలిశారు.
చివరి రోజుల్లో అంటే గొంతులో పుండు వచ్చి నాన్నగారు 15 రోజులు విజయా హాస్పటల్లో ఉన్నారు. ఆయన పాడాల్సిన కొన్ని పాటల రికార్డింగ్స్ ఆగిపోయాయి. షూటింగ్ ప్లాన్ చేసుకున్న వాళ్లు ఇక ఆగలేక ట్రాక్ పాడించి, దాంతో పాటలను చిత్రీకరించారు. ఆ పాటలకు నాన్నగారి వాయిస్ మిక్స్ చేయాలి. అప్పటికి గొంతులో పుండు మానుతోంది. 'ఓవర్ స్ట్రెయిన్ వద్దు,, మీరు పాటలు పాడడానికి వీల్లేదు' అని డాక్టర్లు కచ్చితంగా చెప్పేశారు కూడా. విజయా హాస్పటల్ కొత్తగా కట్టిన రోజులవి. విజయా గార్డెన్స్ గేటు నుంచి లోపలకు వెళ్లాలి. అమ్మ మధ్యాహ్నం వరకూ నాన్న దగ్గర ఉండి, స్నానం చేసి, భోజనం చేసి రావడానికి ఇంటికి వచ్చేది. ఎవరూ లేని సమయం చూసి నిర్మాతలు నాన్నగారి దగ్గరకు వచ్చేవారు. 'మీరు ఈ పాట పాడితే నా సినిమా రిలీజ్ అయిపోతుంది. నేను బయట పడిపోతాను' అని ఏదో ఒక కారణం చెప్పేవారు. నాన్నగారు కరిగి పోయేవారు. ఆస్పత్రిలోనే పాట ప్రాక్టీసు చేసేవారు. మరి థియేటర్‌కు వెళ్లి పాట పాడాలి కదా. ముందు గేటు నుంచి వెళితే అక్కడ సెక్యూరిటీ వాళ్లు ఉంటారు. అందుకే ఆస్పత్రి వెనుక గేటు దగ్గర ఎవరూ ఉండరు కనుక అక్కడికి కారు తెచ్చి నాన్నగారిని తీసుకెళ్లి రికార్డింగ్ థియేటర్లో పాట పాడించి, అమ్మ తిరిగి వచ్చేలోగా హాస్పిటల్లో దిగబెట్టేవారు. అలా పాడలేని పరిస్థితుల్లో కూడా మూడు పాటలు పాడారు నాన్నగారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ విషయం బయట పడిపోయింది. నాగిరెడ్డిగారికి తెలియడంతో ఆయన 'అంత ఆగలేక పోతే వేరే వాళ్లతో పాడించాలి కానీ ఇలా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తారా' అని నిర్మాతల మీద మండి పడ్డారు. వెనుక గేటు దగ్గర కూడా సెక్యూరిటీ పెంచారు.
ఆ రోజు.. నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్లిన రోజు. మధ్యాహ్నం ఆస్పత్రి బెడ్డు మీద కూర్చుని నాన్న మాట్లాడుతున్నారు. నాగిరెడ్డిగారి అల్లుడు, మరో డాక్టరు అక్కడ ఉన్నారు. అమ్మ పళ్లరసం తీస్తోంది. 'మాస్టారూ.. మిమ్మల్ని రేపు డిస్చార్జ్ చేస్తున్నాం. ఇంటికి వెళ్లిన తర్వాత మా కోసం ఓ ప్రైవేట్ సాంగ్ పాడాలి' అన్నారు డాక్టరుగారు. 'అలాగే తప్పకుండా పాడతాను బాబూ' అన్నారు నాన్నగారు. అలా మాట్లాడుతూనే హఠాత్తుగా గుండె పోటు వచ్చి ఒక్కసారిగా పక్క మీదకు ఒరిగిపోయారు నాన్నగారు. ఆ మూడు పాటలు పాడకపోతే నాన్నగారు మరికొన్ని రోజలు బతికేవారేమో!