ప్రేక్షకుల అభిరుచి మారిపోవడంతో కథలో కొత్తదనం లేకపోతే ఎలాంటి భారీ బడ్జెట్ సినిమాను అయినా ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. సోషల్ మీడియా ఓటీటీ లు అందరికీ అందుబాటులోకి రావడంతో పర భాషలలో విడుదలైన మంచి సినిమాల గురించి విషయాలు వార్తలు వెంటనే అందరికీ తెలిసిపోతున్నాయి. దీనితో కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్న టాప్ హీరోలు కూడ తాము ఎలాంటి సినిమాలు చేస్తే జనం చూస్తారు అన్న విషయమై తెగ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు.



‘వాల్తేర్ వీరయ్య’ లాంటి సూపర్ సక్సస్ ను అందుకున్న తరువాత కూడ చిరంజీవి తనతో సినిమాలు చేయాలని ఉత్సాహ పడుతున్న అనేకమంది దర్శక నిర్మాతలను పెండింగ్ లో పెడుతున్నాడు కానీ తన నిర్ణయాన్ని చెప్పడం లేదు. ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘భోళాశంకర్’ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నప్పటికీ తన తదుపరి సినిమా ప్రాజెక్ట్ పై ఒక స్థిరనిర్ణయం తీసుకోలేక పోతున్నాడు అన్నమాటలు వినిపిస్తున్నాయి.



ఇదే పరిస్థితి నాగార్జున విషయంలో కూడ కొనసాగుతోంది. వెండితెర మన్మధుడు గా ఒక వెలుగువెలిగిన ఈ టాప్ హీరో పరిస్థితి మరింత అయోమయంగా ఉంది అని అంటున్నారు. అతడు ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘ది ఘోస్ట్’ మూవీ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో మరొక సినిమాను మొదలుపెట్టడానికి భయపడిపోతున్నాడు అన్నకామెంట్స్ కూడ వస్తున్నాయి. ఇదే బాటలో వెంకటేష్ పరిస్థితి కూడ ఉంది. తన ల్యాండ్ మార్క్ మూవీగా తన 75వ సినిమాను తీయాలని వెంకీ ప్రయత్నిస్తున్నప్పటికీ అతడికి సరైన దర్శకుడు దొరకడంలేదు అని అంటున్నారు.


త్రివిక్రమ్ కొరటాల రాజమౌళి లాంటి టాప్ దర్శకుల చూపు అంతా టాప్ యంగ్ హీరోల పై ఉంటోంది. దీనితో ఈ టాప్ దర్శకులతో సీనియర్ హీరోలు సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వారి ఆశలు నెరవేరడం లేదు. ఈ సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి కొంతమంది టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ ప్రయత్నిస్తున్నప్పటికీ వారిని నమ్మే పరిస్థితులలో సీనియర్ హీరోలు ఉండటం లేదు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో కథల కొరతతో సీనియర్ హీరోల నుండి మీడియం రేంజ్ హీరోల వరకు సతమతమైపోతున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: