దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. లాక్ డౌన్ అమల్లో ఉండటంతో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. లాక్ డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకున్నా కేంద్రం వీటి విషయంలో కొత్త నిబంధనలు జారీ చేయనుందని తెలుస్తోంది. 
 
లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్స్ అన్నీ వాయిదా పడ్డాయి. చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నప్పటికీ లాక్ డౌన్ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా రిలీజ్ డేట్స్ ను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి 2500 కోట్ల రూపాయల నుంచి 3,500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీకు 500 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. 
 
గతంలో తాము ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని టాలీవుడ్ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం లాక్ డౌన్ ఎత్తివేసినా ప్రజలు కొన్ని నెలల పాటు సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించే అవకాశం ఉండదని సినీ విశ్లేషకులు అంచనా వేసున్నారు. లాక్ డౌన్ వల్ల ప్రజలు, ఉద్యోగులు ఇళ్లకే పరిమితం కావడంతో భారీగా ఆదాయం తగ్గింది. రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలైతే మాత్రమే సినిమాలపై కరోనా ప్రభావం గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 
 
మరోవైపు మల్టీప్లెక్స్ నిర్వాహకులు సీటుకు సీటుకు మధ్య భారీగా గ్యాప్ ఉండేలా సీటింగ్ సిస్టమ్ లో మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. కేంద్రం కూడా థియేటర్ల విషయంలో సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా నిబంధనలను విధించనుందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. సీట్లు తగ్గించి టికెట్ రేట్లను పెంచితే ప్రేక్షకులు పెద్ద సినిమాలపై మాత్రమే ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఏ విధంగా చూసినా కరోనా వల్ల చిత్ర పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: