కరోనా వైరస్ కారణంగా థియేటర్లన్నీ మూసివేయడంతో చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు మూలానపడగా... ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నిర్మాతలు తెచ్చిన అప్పులకు వడ్డీలు తడిమొపేడు అవుతున్నాయి. దీంతో వాళ్లంతా గగ్గోలు పెడుతున్నారు. చిత్ర షూటింగ్ లకు కేంద్ర ప్రభుత్వాలు ఓకే చెప్పినా... సినిమా థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అవ్వడం దాదాపు అసాధ్యం. ఈ విపత్కర సమయాల్లో థియేటర్లను తెరవడానికి కనీసం రెండు, మూడు నెలలైనా పడుతుందని తెలుస్తుంది. ఒకవేళ థియేటర్లు ఓపెన్ చేసినప్పటికీ... కరోనా ఎక్కడ సోకుతుందోననే భయంతో ప్రేక్షకులు థియేటర్లకు రారని తెలుస్తుంది. ప్రస్తుతం లాక్ డౌన్ లో పూర్తిస్థాయిలో సడలింపు ఇచ్చినప్పటికీ చాలామంది ప్రజలు ప్రయాణాలు చేయడానికే జంకుతున్నారు. అటువంటిది ఏసీ థియేటర్లలో గంటల పాటు సినిమా చూసేందుకు ప్రేక్షకులు సాహసిస్తారనడం తప్పే. దాంతో నిర్మాతలు చేసేదేమీ లేక తమ సినిమాలను ఓటిటి ప్లాట్ ఫామ్ లలో ఎంతో కొంత డబ్బులకు విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు.


ఇప్పటికే అమితాబ్ బచ్చన్ నటించిన గులాబో సితాబో, జ్యోతిగా లాయర్ గా నటించిన పొన్మగల్ వంధల్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కాగా... కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం జూన్ 19వ తేదీన విడుదల కానున్నది. రామ్ గోపాల్ వర్మ తీసిన మియా మాల్కోవా క్లైమాక్స్ మూవీ కూడా నేరుగా మొబైల్ ఫోన్లలో విడుదలయ్యింది. అనుష్క నిశ్శబ్దం, నాని 'వి' చిత్రాలు కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఇలా విడుదల అవ్వగానే... అలా పైరసీ సైట్లలో ప్రత్యక్షమవుతున్నాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ లలో విడుదలయ్యే సినిమాలు హెచ్డీ ప్రింట్ అనగా హెచ్డీ క్లారిటీతో, పలు భాషల సబ్ టైటిల్స్ తో ప్రసారం అవుతాయి. వాటినే ఉన్నది ఉన్నట్టు కాపీ చేసి అనంతరం తమ వెబ్సైట్ లలో విడుదల చేస్తున్నారు పైరసీ కేటుగాళ్ళు. దీంతో చాలామంది ప్రేక్షకులు ఓటిటి ప్లాట్ ఫామ్ లకు పైసా కూడా కట్టకుండా ఫ్రీగా సరికొత్త సినిమాలను వీక్షిస్తున్నారు. ఫలితంగా ఏ ఒక్క కొత్త యూజర్ యొక్క నెలసరి, సంవత్సరపు చందాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లకు దక్కడం లేదు. కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన సినిమాలను కనీసం లక్షల మంది అయినా చూడకపోతే ఓటిటి సైట్లకు నష్టమే మిగులుతుంది.


ఇప్పటికే పైరసీ భూతం కారణంగా రామ్ గోపాల్ వర్మ క్లైమాక్స్ సినిమా, ఇంకా తదితర సినిమాలు కూడా డబ్బులు చెల్లించని ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లలో చక్కర్లు కొడుతున్నాయి. పైరసీ భూతం ఈ విధంగా ఓటిటి సైట్లకు భారీ నష్టాన్ని మిగుల్చుతుంది. ఈ నష్టాన్ని ఇకపై భరించ కూడదని అనుకుంటే... వారు పెద్ద సినిమాలకు పేపర్ పర్ అవర్ అనే విధానాన్ని పెడతారేమో. పైరసీ భూతం వలన... ఒకేసారి సినిమాను కొనుగోలు చేయకుండా... ఒక రోజుకి ఇంత మంది ఇన్ని గంటలు చూస్తే ఇంత డబ్బులు కట్టిస్తామని ఓటిటి ప్లాట్ ఫామ్ లు బడా సినీ నిర్మాతలకు షరతు పెడతారేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా ఓటిటి లలో చిన్నా చితకా సినిమాలు విడుదలైతే నష్టం వాటిల్లదు కానీ పెద్ద సినిమాలకు మాత్రం పైరసీ కారణంగా భారీ నష్టమే మిగులుతుందని తెలుస్తుంది. ఈ సమస్యను సినిమా వాళ్ళు, ఓటీటీ వాళ్ళు ఎలా పరిష్కరిస్తారో చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: