ఇంటర్నెట్ డెస్క్: రజనీకాంత్.. తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల్లోనే కాదు.. యావత్ భారత దేశంలో.. ఇంకా మాట్లాడితే దేశం ఎల్లలు దాటి మరీ అభిమానులను సంపాదించుకున్న దక్షిణాది నటుడు. ఆయనకున్న మాస్ పాపులారిటీ గురించి మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ తన సింప్లిసిటీని మాత్రం రజినీ ఏనాడూ విడువలేదు. తన నిజాయితీ వదిలిపెట్టలేదు. సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రజినీకాంత్. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీతోనే తమిళ ప్రజల గుండెల్లో తలైవాగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అంతటి గొప్ప నటుడి పుట్టిన రోజు సందర్భంగా నేడు(డిసెంబరు 12, శనివారం) దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు వేడుక చేసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారంటే రజినీ స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక చిత్ర పరిశ్రమ నుంచి  రజినీకి విషెస్ చెప్పనివారు లేరంటే అతిశయోక్తి కాదు.

టాలీవుడ్ నుంచి కూడా రజినీకి అనేకమంది బర్త్‌డే విషెస్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రజినీకి ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. "ప్రియమైన స్నేహితుడికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో అద్భుతమైన విజయాన్ని సాధించినట్లే రాజకీయాల్లోనూ విజయం సాధించాలి. ఈ ప్రత్యేకమైన స్టైల్‌తో కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకున్నారు. ప్రజా సేవలోనూ మీ ప్రత్యేకతను చాటుకుంటారని ఆశిస్తున్నాను" అని రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే రజనీకాంత్ సాధారణంగా పుట్టినరోజును జరుపుకోరు. ఒకవేళ ఏదైనా కార్యక్రమం నిర్వహించినా అది చాలా నిరాడంబరంగానే చేసుకుంటారు. అయితే ఆయన  త్వరలో రాజకీయ పార్టీని  ప్రకటించనున్న నేపథ్యంలో ఆయన  అభిమానులు శనివారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ అన్నాత్తై సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసి రాజకీయ భవిష్యత్తుపై దృష్టి సారించాలని రజనీ భావిస్తున్నారని సమాచారం. అన్నాత్తై చిత్ర షూటింగ్ త్వరలో ముగియనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: