ఈసారి సంక్రాంతి సీజన్ మరింత హీట్ పెంచబోతోంది. ఎందుకంటే ఒకేసారి ఏకంగా ఏడు సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. తెలుగు నుంచి ఐదుగురు హీరోలు బరిలో ఉండగా, తమిళం నుంచి మరో ఇద్దరు హీరోల సినిమాలు కూడా పండక్కే విడుదలకు సిద్ధమవుతున్నాయి. అంటే మొత్తం మీద ప్రేక్షకులకు పండుగ డబుల్ కాదు… ట్రిపుల్ అనేలా పరిస్థితి మారిపోయింది.తెలుగు సినిమాలకే థియేటర్లు సరిపోవడం కష్టమవుతున్న ఈ పరిస్థితిలో, తమిళ సినిమాలకు కూడా స్క్రీన్స్ ఇవ్వాలంటే థియేటర్ యాజమాన్యానికి, నిర్మాతలకు పెద్ద తలనొప్పే. ఎవరి సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయి? ఎవరి సినిమా ఎంత పెద్దగా రిలీజ్ అవుతుంది? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
సంక్రాంతి రిలీజ్ అనేది హీరోలకు కేవలం రిలీజ్ డేట్ మాత్రమే కాదు, అది వారి ప్రతిష్ఠతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ హీరోలు అయితే ఏడాదికి ఒకే సినిమా చేస్తున్న పరిస్థితిలో, అది తప్పకుండా పండక్కే రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఉదాహరణకు 2025 సంక్రాంతిని బాలకృష్ణ తన ఖాతాలో వేసుకుంటే, 2026 పొంగల్‌ను చిరంజీవి టార్గెట్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’ జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే సంక్రాంతి రేసులో జనవరి 9న ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది. ప్రభాస్ సినిమా కావడంతో దేశవ్యాప్తంగా భారీ స్క్రీన్స్ దక్కడం దాదాపు ఖాయం.
అలాగే జనవరి 14న ‘అనగనగా ఒక రాజు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక జనవరి 13న రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ విడుదల కానుండగా, జనవరి 14 సాయంత్రం 5:49 గంటలకు శర్వానంద్ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వనుంది.వీటితో పాటు తమిళం నుంచి విజయ్ నటించిన ‘జన నాయగన్’, శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ కూడా పండక్కే విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇలా ఒకేసారి ఏడు సినిమాలు థియేటర్లలోకి రావడం అనేది సాధారణ విషయం కాదు. ప్రతీసారి పొంగల్‌కు కనీసం మూడు లేదా నాలుగు సినిమాలు బరిలో ఉంటాయి. వాటికే థియేటర్ల పంపకం విషయంలో నిర్మాతల మధ్య మాటల యుద్ధాలు, ఆరోపణలు వినిపిస్తుంటాయి.
“మా సినిమాకు తక్కువ థియేటర్లు ఇచ్చారు”, “వాళ్ల సినిమాను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు” అంటూ ప్రతి ఏడాది వివాదాలు తప్పవు. అలాంటిది ఈసారి ఏకంగా ఏడు సినిమాలు రావడంతో నిర్మాతల మధ్య పెద్ద స్థాయి యుద్ధం తప్పేలా కనిపించడం లేదు.జనవరి 9న ముందుగా విడుదలవుతున్న ‘రాజా సాబ్’ కు ఎక్కువ స్క్రీన్స్ దక్కే అవకాశం ఉంది. అదే రోజు వస్తున్న విజయ్ ‘జన నాయగన్’ కూడా మంచి థియేటర్లు సంపాదించగలదని అంచనా. కానీ ఆ తర్వాత విడుదలయ్యే చిరంజీవి, రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాలకు, అలాగే నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లాంటి యంగ్ హీరోల సినిమాలకు ఎన్ని స్క్రీన్స్ దక్కుతాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.
ప్రత్యేకంగా ఈసారి శర్వానంద్ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ విషయంలో అంచనాలు అంతగా కనిపించడం లేదు. కథ, కంటెంట్ బాగున్నా కూడా, భారీ సినిమాలు వరుసగా విడుదలవుతున్న కారణంగా ఈ సినిమాకు కావాల్సినంత థియేటర్ స్పేస్ దక్కడం కష్టమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఈసారి శర్వానంద్‌కు హిట్ పడే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో వినిపిస్తోంది.మొత్తానికి చూస్తే, 2026 సంక్రాంతి సినిమా మార్కెట్ పూర్తిగా హాట్ అయిపోయింది. ప్రేక్షకులకు పండుగ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చినా, నిర్మాతలకు మాత్రం ఈసారి సంక్రాంతి పెద్ద పరీక్షగా మారబోతోందని చెప్పక తప్పదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి