ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్‌కు మరో కొత్త బ్యూటీ రాబోతోంది. అది కూడా గాంధార దేశం నుంచి. అదేనండి ఆఫ్ఘనిస్తాన్. అవును బాలీవుడ్‌లో 2018లో తెరకెక్కిన `లవ్‌యాత్రి` సినిమాలో మెప్పించిన బాలీవుడ్‌ నటి వరీన హుస్సేన్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో మెరవబోతోంది. అది కూడా అరంగేట్రంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో నటించే ఛాన్స్ కొట్టేసినట్లుంది. దీనికి సంబంధించి ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఎన్టీయార్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న సినిమాలోనే వరీనా హీరోయిన్‌గా ఎంపికైనట్టు వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో గుప్పుమన్నాయి. దీనికి కారణం ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియోనే. రామకృష్ణ స్టూడియోస్‌లోకి తన కారులో వెళుతున్న ఓ వీడియోను వరీనా తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎన్‌టీఆర్‌తోనే నటించనుందని అభిమానులు చర్చించుకుంటున్నారు.

అయితే ఆమె నటిస్తోంది ఎన్టీయార్ సినిమాలో కాదని, కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమా కోసమేనని, అందుకే  టెస్ట్ షూట్ కోసం ఆమె హైదరాబాద్ వచ్చిందని మరో వాదన వినిపిస్తోంది.

తాజాగా వరీనా మరో వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. `అందరికీ నమస్కారం. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లో ఉన్నాను. మీకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అతి త్వరలో ఆ సర్‌ప్రైజ్ ఏంటో మీకు అందరికీ చెబుతానం’టూ మరో స్పెన్స్‌కు తెరలేపింది. ఇంకా మరో విశేషం ఏంటంటే వరీన ఈ వీడియో అచ్చ తెలుగులో మాట్లాడింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్‌టీఆర్.. రామ్ చరణ్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా.. ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీంగా కనిపించనున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ 13కల్లా చిత్రాన్ని విడుదల చేయాలని జక్కన్న రెడీ అవుతున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: