
తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా పలువురు యువ దర్శకులను అలాగే టెక్నీషియన్స్ ను దూరం చేసుకున్న సినీ ఇండస్ట్రీలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రీకి - మీడియాకి మధ్య వారధిలా వ్యవహరిస్తూ అందరు హీరోలకు తలలో నాలుకలా వ్యవహరిస్తున్న పీఅర్వ్ప్ బీఏ రాజు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు.. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఆయనకు నిన్న అర్ధరాత్రి సమయంలో గుండెపోటు వచ్చిందని, ఈ నేపథ్యంలో ఆయనను ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది..
వయసురీత్యా బి.ఏ.రాజు గత కొంత కాలంగా డయాబెటిస్ సంబంధిత రోగంతో బాధ పడుతున్నారని దీనికి తోడు నిన్న గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని తెలుస్తోంది. హాస్పిటల్ కి తరలించగా ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు అని తెలుస్తోంది. సుమారు 1500 పైగా సినిమాలకు పిఆర్ఓ గా పనిచేసిన ఆయన తన భార్యను దర్శకురాలిని చేసేందుకు తాను నిర్మాతగా మారారు. భార్య జయ దర్శకత్వం వహించిన పలు సినిమాలను ఆయన నిర్మించారు. సినీ జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పటికీ ఇండస్ట్రీ హిట్ అనే పత్రిక నడుపుతున్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, నాగార్జున వంటి హీరోలకు ఆయన పని చేశారు.
అయితే 2018లో జయ కూడా గుండెపోటుతో మరణించారు. ఒక రకంగా ఆమె చనిపోయినప్పటి నుంచి బిఏ రాజులో నిర్వేదం నెలకొందని చెబుతూ ఉంటారు. ఇక ఆమె చనిపోయినప్పుడు విషయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రముఖ రచయిత భాస్కరభట్ల ఒక విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. '' జయ గారు పోయినప్పుడు వెళ్లి రాజు గార్ని ఓదార్చబోతే ఆయన అన్న ఒకే మాట, 'నేనే మరణించాను , ఆవిడే బతికుంది నా రూపంలో ' అని . ఎంత ప్రేమ తో కూడిన మాట అది ! రాజు గారూ శ్రద్దాoజలి'' అంటూ ఆయన పేర్కొన్నారు.