
కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో కష్టాలు ఇంకా ఉంటూనే ఉన్నాయి. ఈ మహమ్మారి వల్ల మొదటి దశలో సినిమా వాళ్లు ఎన్నో కష్టాలు పడ్డారు. మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం లో ఎంతో ఇబ్బంది పడి కొంత వరకు సక్సెస్ అయ్యారు. కానీ రెండవ దశ అంటూ మళ్లీ కరోనా సినిమా ఇండస్ట్రీని కాటేసింది. దాంతో సినిమా థియేటర్లు షూటింగ్ లు అన్నీ ఆగి పోయాయి. కానీ ఈ సారి కరోనా ప్రభావం ఇండస్ట్రీపై చాలానే ఉందనే చెప్పవచ్చు. ఇప్పటివరకు సినిమా థియేటర్లు ఓపెన్ కాలేదు. ఈ నేపథ్యంలో జూలై 30 నుంచి ఇద్దరు హీరోలు సినిమాలు విడుదల చేస్తామని ప్రకటించగా వీరి సాహసం టాలీవుడ్ కి ఉపయోగ పడుతుంది అనేది చూడాలి.
నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న మొట్టమొదటి క్రేజీ ప్రాజెక్ట్. నాని శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నిన్ను కోరి అనే సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతుండగా జగపతి బాబు కళ్యాణి మరో జంటగా నటిస్తున్నారు.
ఇకపోతే అదే రోజున టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటిస్తున్న తిమ్మరుసు అనే సినిమా కూడా విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు మంచి మంచి సినిమాలతో అలరించిన సత్యదేవ్ మరొక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన చేసిన గత సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా ఈ రెండు సినిమాలు టాలీవుడ్ నుంచి విడుదలవుతున్న సినిమాలు కాగా ఈ సినిమాల ఫలితాలపై టాలీవుడ్ భవిష్యత్తు ముడిపడి ఉంటుంది అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ ఇద్దరు హీరోల సాహసం టాలీవుడ్ కు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం.