
కాకతీయుల పతనంతో వజ్రం ముస్లిం పాలకుల చేతుల్లోకి వెళ్లింది. ఖిల్జీ వంశాధిపతుల దగ్గర నుంచి మొఘల్ బాబర్ వరకూ ఈ వజ్రం ప్రయాణం చేసింది. బాబర్ తర్వాత షాజహాన్ దాన్ని నెమలి సింహాసనంలో భాగంగా రూపొందించాడు. ఆ తర్వాత 1739లో భారతదేశంపై దాడిచేసిన పర్షియన్ సామ్రాట్ నాదిర్ షా ఈ వజ్రాన్ని ‘కోహ్-ఇ-నూర్’గా పేరు పెట్టాడు – అంటే వెలుగుల కొండ.ఆ తర్వాత ఆఫ్ఘాన్, సిక్కు సామ్రాజ్యాలు, చివరికి బ్రిటిష్ వలస పాలకులు ఈ వజ్రాన్ని వాడుకుంటూ వచ్చారు. బ్రిటిష్ వారు సిక్కుల రాజు దులీప్ సింగ్ నుంచి బలవంతంగా ఈ వజ్రాన్ని తీసుకొని, చివరకు క్వీన్ విక్టోరియా కు అందించారు. అప్పట్నుంచి కోహినూర్ బ్రిటన్ కిరీటాల్లో భాగమైంది.
విచిత్రంగా, ఈ వజ్రాన్ని ధరించిన పాలకుల్లో చాలామంది తమ సామ్రాజ్యాలను కోల్పోయారు. అదే కారణంగా క్వీన్ విక్టోరియా ఒక శాసనం ద్వారా ఈ వజ్రాన్ని రాణులకే పరిమితం చేశారు. ఇప్పుడు ఈ వజ్రం లండన్‌లోని టవర్ ఆఫ్ లండన్‌లో ఉన్నా, ఇది మనదే అని భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్తాన్, ఇరాన్ వాదనలు వినిపిస్తున్నాయి.కోహినూర్ చరిత్ర కేవలం వజ్రం ప్రయాణం కాదు. అది పవర్, రాజకీయం, యుద్ధం, ధ్వంసం, అరాధన అన్నీ కలగలిసిన సాంకేతిక గాథ. అది ఇప్పటికీ ఆధునిక రాజ్యాల మధ్య ఉద్వేగాన్ని రగిలిస్తోంది. కోహినూర్ నిజంగా ఎవరిది అనే ప్రశ్నకు సమాధానం లేకపోయినా... ఇది చరిత్రకు సజీవ సాక్షిగా మిగిలిపోతోంది.