రీరిలీజ్‌ల ట్రెండ్‌లో 'బాహుబలి: ది ఎపిక్' అద్భుతం సృష్టించింది. గతంలో రెండు భాగాలుగా విడుదలై ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన ఈ సినిమాను, ఇప్పుడు రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా రీ-ఎడిట్ చేసి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో మళ్లీ విడుదల చేయడం, బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పదేళ్ల తర్వాత కూడా ప్రభాస్, రాజమౌళిల ఈ విజువల్ వండర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ఈ విజయంతో ఇప్పుడు సినీ అభిమానుల దృష్టి మరో రెండు భారీ పాన్-ఇండియా సిరీస్‌లపై పడింది. అవే 'పుష్ప' మరియు 'కేజీఎఫ్' సిరీస్‌లు. ఈ రెండు సిరీస్‌లు కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి, నూతన రికార్డులను సృష్టించాయి. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో ఈ చిత్రాలకు లభించిన ఆదరణ అనూహ్యమైనది.
'బాహుబలి' తరహాలోనే, 'పుష్ప' మొదటి భాగం, రెండో భాగాలను కలిపి లేదా 'కేజీఎఫ్' మొదటి, రెండో భాగాలను కలిపి ఒకే సినిమాగా రీ-రిలీజ్ చేస్తే బాగుంటుందని, ఫ్యాన్స్ నుంచి బలంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. అల్లు అర్జున్ 'పుష్పరాజ్' పాత్రను, యశ్ 'రాకీ భాయ్' పాత్రను మళ్ళీ పెద్ద తెరపై ఒకేసారి చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇలా రెండు భాగాలను ఒకేసారి చూసే అవకాశం దొరికితే, అది అభిమానులకు ఒక పండుగలా ఉంటుందని వారి అభిప్రాయం.
అయితే, ఈ రీరిలీజ్ ప్రతిపాదనపై 'పుష్ప' (మైత్రీ మూవీ మేకర్స్) మరియు 'కేజీఎఫ్' (హోంబలే ఫిలిమ్స్) సిరీస్‌ల నిర్మాతల ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి. 'బాహుబలి' సక్సెస్ ట్రెండ్‌ను అనుసరించి, ఈ రెండు సిరీస్‌లను కూడా రీరిలీజ్ చేసే అవకాశాలు లేకపోలేవు. అదే జరిగితే, బాక్సాఫీస్ వద్ద మరోసారి కలెక్షన్ల సునామీ ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో త్వరలో ప్రకటన వస్తుందేమోనని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి