సినిమా పరిశ్రమలో ఒక సినిమా విడుదలకు ముందు దానిపై అంచనాలు పెంచడం అనేది సాధారణ విషయం. అయితే, ఈ మధ్యకాలంలో కొందరు సెలబ్రిటీలు తమ సినిమాల ఫలితంపై ఉన్న అతివిశ్వాసంతో చేస్తున్న వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆ సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇలాంటి బోల్డ్ స్టేట్‌మెంట్లు అటు అభిమానుల్లో ఉత్సుకత రేకెత్తిస్తున్నప్పటికీ, ఇటు విమర్శల పాలవుతున్నాయి.

ఎన్నో వాయిదాల తర్వాత శుక్రవారం విడుదలైన 'మాస్ జాతర' సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, కలెక్షన్ల పరంగా ఈ సినిమా అభిమానులకు కొంత నిరాశను మిగిల్చిందని సమాచారం. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ,  మాస్ జాతర మూవీ కచ్చితంగా హిట్అవుతుంది  అంటూ ఛాలెంజ్ విసిరారు. ఆయన ఇంతకుముందు నితిన్ 'రాబిన్ హుడ్' సినిమా విషయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి, ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇప్పుడు 'మాస్ జాతర' ఫలితం కూడా అంచనాలను అందుకోకపోవడంతో, రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల కోవకు చెందినదే నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్లు. 'వార్ 2' సినిమా విడుదల సందర్భంగా ఆయన సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేస్తూ కామెంట్లు చేశారు. అయితే, సినిమా విడుదలయ్యాక ఆశించిన ఫలితం రాకపోవడంతో, ఆయనపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత ఆయనే సినిమా పరాజయాన్ని పరోక్షంగా అంగీకరించి, నష్టపోయినట్లు అంగీకరించడం గమనార్హం.

అదేవిధంగా, 'మిత్రమండలి' సినిమా సమయంలో కూడా మేకర్స్ తమ సినిమా కడుపుబ్బా నవ్విస్తుందని ప్రేక్షకులను నమ్మించారు. కానీ, విడుదల తర్వాత ఈ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు పొందడంలో విఫలమై, మేకర్స్‌ను అడ్డంగా బుక్ చేసింది.

సినిమాపై అంచనాలు పెంచడం వరకు బాగానే ఉన్నా, ఇలాంటి అతివిశ్వాసం నిండిన వ్యాఖ్యలు చేయడం వలన అంచనాలు అందుకోలేనప్పుడు సెలబ్రిటీలు, మేకర్స్ విమర్శల పాలవుతున్నారు. సినిమా కంటెంట్ బలంగా ఉంటే, ఇలాంటి స్టేట్‌మెంట్స్‌తో పనిలేకుండానే ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని ఈ పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: