భారత సినీ చరిత్రలో కొత్త దిశా నిర్ధేశం చేసిన చిత్రం ‘శివ’ మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. నాగార్జున–రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం 1989లో విడుదలై అప్పట్లో తెలుగు సినిమా రూపురేఖలను మార్చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ‘శివ’ కేవలం సినిమా మాత్రమే కాదు — ఆ కాలంలో యూత్ ఆలోచనా విధానాన్ని, సినిమా తీయడంలో ఉన్న టెక్నికల్ ఎలిమెంట్స్‌ను, యాక్షన్ సన్నివేశాల ప్రెజెంటేషన్‌నే పూర్తిగా రీవాల్యూషనైజ్ చేసింది.ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత ఈ ఐకానిక్ సినిమా రీ-రిలీజ్ అవుతోంది. నవంబర్ 14న ప్రేక్షకులు మరోసారి థియేటర్లలో ‘శివ’ మ్యాజిక్‌ను ఆస్వాదించబోతున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇద్దరూ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టులు, రీ-రిలీజ్ ఈవెంట్స్‌తో ఈ ఇద్దరూ మళ్లీ పాత జ్ఞాపకాలను తెచ్చిపెడుతున్నారు.


ఈ క్రమంలో ఆర్జీవీ చేసిన ఒక ప్రత్యేకమైన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆయన, ‘శివ’ సినిమాలో నటించిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సినిమాలో నాగార్జున అన్నయ్య పాత్రలో నటించిన మురళీ మోహన్ కూతురుగా సుష్మ అనే చిన్నారి నటించిన సంగతి చాలా మందికి గుర్తుండి ఉంటుంది. సినిమాలో ఆమె “బాబాయ్…” అంటూ నాగార్జున వెనక తిరుగుతూ కనిపించే సన్నివేశాలు అప్పట్లో ఎంతో పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా నాగార్జున–సుష్మ పై తెరకెక్కిన సైకిల్ ఛేజ్ సీన్ మాత్రం అప్పటి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. విలన్స్ వెనక నుంచి వెంబడిస్తుండగా నాగార్జున చిన్నారిని సైకిల్‌పై కూర్చోబెట్టి తప్పించుకునే ఆ సన్నివేశం సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది.అలాంటి సన్నివేశంలో కనిపించిన ఆ చిన్నారి సుష్మ ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో చాలా మందికి తెలియదు. అయితే తాజాగా ఆర్జీవీ స్వయంగా ఆ విషయం వెల్లడించాడు.

 

తన ‘ఎక్స్’ (ట్విట్టర్) అకౌంట్‌లో సుష్మ ప్రస్తుత ఫోటోను షేర్ చేస్తూ — “శివ సినిమాలోని ఐకానిక్ సైకిల్ ఛేజింగ్ సీన్‌లో భయంతో కనిపించిన ఆ చిన్నారి సుష్మ ఇప్పుడు అమెరికాలో AI & Cognitive Science లో రీసెర్చ్ చేస్తోంది” అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.ఆ ట్వీట్‌కు స్పందిస్తూ సుష్మ ఆనంద్ అకోజు కూడా ఎమోషనల్ రిప్లై ఇచ్చింది. ఆమె తన రీట్వీట్‌లో ఇలా పేర్కొంది —“థ్యాంక్యూ సర్! శివ లెగసీలో నన్ను గుర్తుంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. చిన్నప్పుడు ఆ అనుభవం నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. అలాంటి గొప్ప సినిమాలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాగార్జున గారు, మీరు రీ-రిలీజ్‌తో మరోసారి భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.” అంటూ రాసుకొచ్చింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: