పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసు విచారణలో సంచలన నిజాలను బయటపెట్టాడు. “ప్రపంచంలో ఎవరితోనూ నాకు వ్యక్తిగత సంబంధం లేదు. పైరసీ సినిమాల వెనుక జరుగుతున్న ప్రతి అంశానికీ నేనే పూర్తిగా బాధ్యత వహిస్తాను” అని రవి వాంగ్మూలంలో తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు .కొన్ని రోజులుగా కొనసాగిన పోలీసు కస్టడీ శనివారం తో ముగిసింది. విచారణలో రవి నేరారోపణలను అంగీకరిస్తూ, కేవలం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పైరసీ కార్యకలాపాల్లోకి అడుగుపెట్టినట్లు ఒప్పుకున్నాడని సమాచారం. సినిమాలు లీక్ చేస్తే వచ్చే ఆర్థిక లాభాలపై దృష్టి పెట్టి, చట్టపరమైన పరిణామాలను పట్టించుకోలేదని రవి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.


2023లో ‘ఖుషి’ సినిమా విడుదల సందర్భంగా సినీ నటుడు విజయ్ దేవరకొండను లక్ష్యంగా చేసుకుని రవి చేసిన హెచ్చరికను ఇప్పుడు పోలీసులు బయటపెట్టడం మరింత కలకలం రేపుతోంది. ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా రవి విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిన బెదిరింపు సందేశాల్లో,“మా మీద ఫోకస్ చేస్తే, మేము మీ మీద ఫుల్ ఫోకస్ చేయాల్సి వస్తుంది. మీరు ఏజెన్సీలకు డబ్బులు ఇస్తున్నారు కానీ మా వాళ్లను పట్టించుకోవడం లేదు. మమ్మల్ని తొక్కి మా పేరుతో iBOMMAFF.in పేరుతో రన్‌ చేస్తున్నారు’ అంటూ తమ జోలికి రావద్దని రవి పెట్టిన ఆ మెసేజ్‌ను పోలీసులు తాజాగా బయటపెట్టారు.

 

ఈ హెచ్చరికలు అప్పట్లో బయటకు రాలేదు. ఇప్పుడు రవి కస్టడీ సమయంలో పోలీసులకు అన్న విషయాలను బహిర్గతం చేయడంతో, ఈ కేసుకు కొత్త మలుపు తిరిగింది. సినీ పరిశ్రమతో పాటు సైబర్ క్రైమ్ విభాగం కూడా ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రవి ఒంటరిగా కాకుండా ఇంకా కొంతమంది సహచరులతో కలిసి పైరసీ నెట్‌వర్క్ నడిపినట్లు అనుమానిస్తున్నారు. రవి అంగీకరించిన వివరాలను ఆధారంగా చేసుకుని, ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరికొంత మందిని గుర్తించే పనిని పోలీసులు వేగవంతం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: