దక్షిణ భారత సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తే వార్త ఇది. అలనాటి ప్రముఖ సినీ దర్శక–నిర్మాత ఎస్.ఎం.ఎస్. సుందరరామన్ గారి కుమారుడు, నటి కనక మహాలక్ష్మి (కనక) తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్.ఎస్. దేవదాస్ (88) ఇక లేరన్న వార్త సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.


ఎస్.ఎస్. దేవదాస్ తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో పని చేసిన అనుభవజ్ఞులైన దర్శకులు. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు భీమ్‌సింగ్ రూపొందించిన 'ప' అక్షరంతో ప్రారంభమయ్యే అనేక తమిళ, హిందీ చిత్రాలకు ఆయన సహాయ దర్శకుడిగా సేవలు అందించారు. తన కాలంలో అత్యంత క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన దర్శకుడిగా పేరును సంపాదించుకున్నారు. వ్యక్తిగత జీవితంలో ఆయన ప్రముఖ నటి దేవికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు పుట్టిన సంతానమే హీరోయిన్ కనక మహాలక్ష్మి. అయితే వివాహ సంబంధాలు కొంతకాలానికి దెబ్బతిని, ఇరువురూ విడిపోయారు. ఆ తర్వాత దేవదాస్‌ గారికి తన కుమార్తె కనకతో పెద్దగా సంబంధాలు కొనసాగలేదు. అయినప్పటికీ ఆమె సినీ రంగంలో మంచి గుర్తింపు పొందిన నటి.



1938 ఆగస్టు 3న తమిళనాడులోని మదురైలో జన్మించిన దేవదాస్, చిన్ననాటి నుంచే భక్తిశ్రద్ధ కలిగిన వ్యక్తి. ముఖ్యంగా అయ్యప్ప భక్తుడు అయిన ఆయన, 40 ఏళ్లకు పైగా నిరంతరంగా శబరిమల యాత్ర చేసి స్వామివారి దర్శనం చేసుకున్నాడు. అయ్యప్ప భక్తుల గురుస్వామిగా పేరుపొందిన ఎం.ఎన్. నంబియార్ గారి అభిమానాన్ని, ఆదరణను పొందిన ఆయన, భక్తి–వ్రతాచరణల విషయంలో ఎంతో కట్టుదిట్టమైన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. ఆయన మరణవార్త తెలస్తూనే సినీ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు ఆయన కుటుంబ సభ్యులకు సంతాప సందేశాలు తెలియజేస్తున్నారు. దేవదాస్ చిరస్మరణీయ సేవలు, ఆయన సినీ ప్రయాణం పరిశ్రమకు చేసిన సేవలుగా చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: