ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా గట్టిగా నడుస్తోంది. భారీ బడ్జెట్, భారీ తారాగణం లేకపోయినా కేవలం బలమైన కంటెంట్‌తో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తున్న చిత్రాలను ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. ఈ వరుసలో 'కలర్ ఫోటో', 'బెదురులంక 2012' వంటి విభిన్నమైన మరియు విజయవంతమైన చిత్రాలను అందించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వస్తున్న తాజా చిత్రం 'దండోరా'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నవదీప్, నందు, బిందు మాధవి వంటి ప్రతిభావంతులైన నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో, ఒకప్పటి హీరో శివాజీ కీలక పాత్రలో కనిపించడం విశేషం.
ముఖ్యంగా ఈ సినిమాలో శివాజీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుండటం సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. సమాజంలోని కుల వివక్ష, చదువు ప్రాధాన్యత వంటి సున్నితమైన అంశాలను స్పృశిస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ముఖ్యంగా ట్రైలర్‌లో వచ్చే "కల్లు మత్తు కాదు కదా సార్ రాత్రి తాగింది పొద్దుగాల దిగనీకి.. కులం మత్తు కదా సార్ దిగడానికి కొంచెం టైం పట్టింది" అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా, సినిమాలోని గాఢతను తెలియజేస్తోంది.
సమాజంలోని అట్టడుగు వర్గాల గొంతుకగా, వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపే కథాంశంతో 'దండోరా' రూపొందినట్లు తెలుస్తోంది. నవదీప్, నందు తమ నటనతో కొత్త కోణాలను ఆవిష్కరించగా, బిందు మాధవి నటన సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రతిభ గల నటీనటులు, ఆలోచింపజేసే సంభాషణలు, సమాజానికి అవసరమైన సందేశం కలగలిసి ఉండటంతో ఈ సినిమా మరో 'కలర్ ఫోటో' లాంటి విజయాన్ని అందుకుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న 'దండోరా' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి