టాలీవుడ్‌లో మరోసారి వివాదం చెలరేగింది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. తాజాగా విడుదలకు సిద్ధమవుతున్న ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా టాలీవుడ్ హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.


ఈ ఈవెంట్‌లో మాట్లాడిన శివాజీ, హీరోయిన్లు పొట్టి బట్టలు ధరించడం కంటే సంప్రదాయ దుస్తుల్లో, ముఖ్యంగా చీరకట్టులో కనిపిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మహిళల దుస్తులపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కొందరికి నచ్చకపోగా, మరికొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ వ్యాఖ్యలు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను కించపరిచే విధంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.శివాజీ వ్యాఖ్యలపై ఇప్పటికే సింగర్ చిన్మయి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. మహిళల శరీరాలపై, వారి ఎంపికలపై వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ కూడా స్పందించడం చర్చను మరింత వేడెక్కించింది.



అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. “నా శరీరం నా ఇష్టం. ఇది మీది కాదు. మేం ఇలాగే ఉంటాం” అన్న అర్థం వచ్చేలా ఆమె చేసిన వ్యాఖ్యలు శివాజీ కామెంట్లకు కౌంటర్‌గా భావిస్తున్నారు. అయితే ఆమె ఎక్కడా శివాజీ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. అయినప్పటికీ ఈ పోస్ట్ ఎవరి కోసం అన్నది అర్థమవుతోందని నెటిజెన్లు వ్యాఖ్యానిస్తున్నారు.అనసూయ పోస్ట్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది అనసూయ స్పందనను పూర్తిగా సమర్థిస్తూ, “చాలా రోజుల తర్వాత కరెక్ట్‌గా రియాక్ట్ అయ్యారు”, “మహిళల స్వేచ్ఛపై ఇలాంటి గట్టిగా మాట్లాడాల్సిందే” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు, కొంతమంది మాత్రం శివాజీ పేరు పెట్టి నేరుగా కౌంటర్ ఇవ్వాల్సిందని, పరోక్షంగా స్పందించడం ఎందుకని ట్రోల్స్ చేస్తున్నారు.



ఇక సోషల్ మీడియాలో మరో వర్గం నెటిజెన్లు ఈ వ్యవహారాన్ని సరదాగా తీసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. “ఈ అనసూయానే శివాజీకి కరెక్ట్ మొగుడు”, “బాసూ… ఏం రిప్లై ఇచ్చింది, వేరే లెవల్!” అంటూ మీమ్స్, పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.మొత్తానికి శివాజీ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, డ్రెస్సింగ్ ఛాయిస్ అనే పెద్ద చర్చకు దారి తీసింది. సెలబ్రిటీల వ్యాఖ్యలు ఎంత ప్రభావం చూపుతాయో మరోసారి ఈ ఘటన రుజువు చేస్తోంది. ఈ అంశంపై ఇంకా ఎవరెవరు స్పందిస్తారో, ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి మరి..???



మరింత సమాచారం తెలుసుకోండి: