(మొదటి భాగం తరువాయి) తెలుగులో అగ్రస్ధానికి చేరుకున్న సావిత్రి తమిళ చిత్రాలలోనూ నటించి పేరు తెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందింది. అలాగే సావిత్రి 1968లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. బహుశా దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా దాదాపుగా పూర్తిగా మహిళల చే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తరువాత చిరంజీవి, మాతృదేవత, వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది. కాగా, మహానటి సావిత్రి సంసార జీవిత విశేషానికి వస్తే 1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ ను పెళ్ళి చేసుకుంది. వారికి ఒక కుమార్తె, కుమారుడు. విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి విఫలమైంది. కెరీర్ లో ఉన్నత స్థితి, మహానటిగా అందరి అభిమానాన్ని అందుకున్న సావిత్రి తరువాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఆర్థిక ప్రణాళికలపై ఆసక్తి లేకపోవడం, సంపాదించిన ధనాన్ని దాచుకోకపోవడం, దాన ధర్మలు విరివిగా చేయడం వంటి కారణాలతో సావిత్రి చివరి రోజులలో చాలా కష్టాలు పడింది. హీరోయిన్ గా తిరుగులేని స్థాయిలో రాణించిన సావిత్రి తల్లి, వదిన పాత్రలలో కూడా నటించింది. ఆస్తిపాస్తులు కోల్పోయి తాగుడుకు, మత్తు మందులకు, నిద్ర మాత్రలకు బానిసై 1981 డిసెంబర్ 26న మరణించింది. సినిమాలలో ఎన్నో ఉన్నత సన్నివేశాలకు తన అభినయంతో ప్రాణ ప్రతిష్ట చేసి సావిత్రి తన నిజ జీవితంలోనూ ఎంతో ఉన్నతంగా జీవించింది. ఆవి మన దేశానికి, పాకిస్థాన్ కు యుద్ధం జరుగుతున్న రోజులవి. ఎదో పని మీద అప్పటి ప్రధాని లాల్ బహుదార్ శాస్ర్తిని కలవడానికి వెళ్లింది. ఆ సమయంలో సావిత్రి పూర్తిగా విలువైన బంగారు అభరణాలు ధరించి ఉంది. శాస్ర్తి గారు సావిత్రికి యుద్ధం గురించి, దేశం ఎదుర్కొంటున్న నిధుల కొరత గురించి చెప్పారు. దీనికి స్పందించిన సావిత్రి తన ఒంటి మీద మొత్తం అభరణాలు తీసి ఇచ్చింది. అలాగే ఒకసారి విషాద సన్నివేశంలో సావిత్రి నటించాల్సి వచ్చింది. దర్శకుడు గ్లిజరిన్ ఉపయోగించమని చెప్పాడు. ఈ మాత్రం దానికి గ్లిజరిన్ ఎందుకండీ..? మీకు ఎన్ని కన్నీటి చుక్కలు కావాలో చెప్పండి చాలు అని చెప్పింది సావిత్రి. దీనికి దర్శకుడు ఆశ్చర్యపోతూ.. మూడు చుక్కలు చాలు అన్నాడు. సావిత్రి గ్లిజరిన్ ఉపయోగించకుండా, మూడే మూడు కన్నీటి చుక్కలు కార్చి సన్నివేశాన్ని ముగించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి