చంద్రబాబు ఎందుకు ఓడిపోయాడో.. మహాభారతం లోని శ్లోకాల సాక్షిగా.. రాజకీయాల్లో బంధుప్రీతి ప్రమాదమా? పాండవుల దగ్గరకు కౌరవుల తరఫున సంజయుడు రాయబారానికి వెళ్ళి హస్తినకు తిరిగివచ్చాడు. అనంతరం మహారాజు ధృతరాష్ట్రుడి దర్శనం చేసుకున్నాడు. అక్కడ ఏం జరిగిందని? సంజయుడిని ప్రశ్నించాడు ధృతరాష్ట్రుడు. రేపు సభలో చెబుతాను అని చక్కాపోయాడు సంజయుడు.


దీంతో ముసలిరాజుకు నిద్రపట్టలేదు. ఏం చేయాలో తోచలేదు. వెంటనే ద్వారపాలకుడిని పిలిచి మంత్రి విదురుడికి కబురు పంపాడు. వచ్చిన విదురుడు ముఖమల్ చెప్పు పేడలో ముంచి ముఖాన కొట్టకుండా పార్లమెంటరీ లాంగ్వేజ్లో అంతకంటే పరుషంగా మాట్లాడలేని విధంగా విదురనీతి పేరున అద్భుతమైన నీతి బోధించాడు.


ధృతాష్ట్రునితో సంజయుడు, విదురుడు ప్రర్తించిన తీరు నేడు సచీవాలయాల్లో పనిచేయాలి అనుకునే ఐఏఎస్ లు అంతా అధ్యయనం చేయాలి. నేతలతో ఎలా ప్రవర్తించాలో ఇందులో స్పష్టంగా ఉంది. సంజయుడు కేవలం మేధస్సు వల్లమాత్రమే మంత్రి అయిన వాడు. విదురుడు లెక్కలోకి రాని సంతానంగా అంతఃపురంలో పుట్టిన మేధావి. ఇది ఈ ఇద్దరికీ ఉన్నతేడా. బంధుత్వం ఉన్న వారు నేతతో ఎలా ప్రవర్తించాలి? అధికారంతో ఉన్నవారు నేతలతో ఎలా మాట్లాడాలో ఈ ఇద్దరి వల్లా తెలుస్తుంది. విదురుడు మాట్లాడినంత స్వేచ్ఛగా మాట్లాడడు సంజయుడు, కానీ పదును మాత్రం అంతే ఉంటుంది.


రాజకీయాల్లో బంధువులు, జ్ఞాతులు ఉండవచ్చా అనేది నేడు మహాప్రశ్న. చాలా మంది వారసత్వరాజకీయాలు, బంధుప్రీతి గురించి ధారాళంగా ప్రశ్నిస్తున్నారు. నిన్నటి అధికారంలోని తెలుగుదేశం, నేటి అధికారంలోని వైకాపాలను మహాభారతంలో భీష్ముడు చెప్పిన రాజనీతితో పరిశీలిద్దాం.
భీష్ముడిని ధర్మరాజు ‘‘ఎటువంటి స్వభావం, ప్రవర్తన కలవారిని రాజు నమ్మాలి? ఎటువంటి వారిని నమ్మకూడదు?(కిం శీలః కింసమాచారః రాజ్ఞో2థ సచివో భవేత్| కీదృశే విశ్వసేద్రాజా కీదృశే న చ విశ్వసేత్||)‘‘ అని ప్రశ్నించాడు.


దీనికి భీష్ముడు విశ్వాసరాజకీయాల్లో సూక్ష్మధర్మం బోధించాడు. ఇక్కడ రహస్యం ఏమంటే నేత ఎవరినీ నమ్మరాదు. కానీ సేవకుడు నేత పట్ల నమ్మకంగా ఉండాలి. తనను నేత నమ్మడం లేదు అని తెలిసినా విశ్వాసంగా ఉండే వాడే నిజమైన బంటు.  రాజు విశ్వసించతగిన వారిలో ఇప్పటి వరకూ జ్ఞాతులను భీష్ముడు చేర్చలేదు. రాజకీయాల్లో బంధుప్రీతి గురించి ప్రత్యేకంగా ఆ మహానుభావుడు కొన్ని యుగాల క్రితమే చెప్పాడు. జ్ఞాతులు అంటే తన తండ్రితాత అన్నతమ్ములు వారి పిల్లలు. దాయాదులు. బంధువులు, రక్తసంబంధీకులు అందరినీ ఈ కోవలో ఏకం చేసి భీష్ముడు చెబుతున్నాడు. రాచరికంలో బంధువులను దూరం చేసుకోలేరు. ఇదిలా ఉంచితే భీష్ముడు చెప్పినదాన్ని పరిశీలిస్తే ఆ అపరమమేధాని ఆనాడే ప్రజాస్వామ్య విధానాన్ని ఊహించాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి నేటికీ ఆచరణయోగ్యంగా ఉన్నాయి.
 
జ్ఞాతిభ్యశ్చైవ బుద్ధ్యేథాః మృత్యోరివ భయం సదా|
ఉపరాజేవ రాజర్థిం జ్ఞాతిర్న సహతే సదా||


నేతలకు మృత్యువుతో సమానమైన శత్రువు జ్ఞాతులే. వీరి వలన సదా భయం పొంచి ఉంది. సామంత రాజు తన చక్రవర్తి ఉన్నతిని కోరుకోడు. సదా అతని పతనాన్నే కోరుకుంటాడు. జ్ఞాతి కూడా అంతే అని స్పష్టంగా చెప్పాడు. ఇది చదవగానే నారావారి రాజకీయాలు బహుశా ఈ సూత్రం మీదే ఆధారపడి ఉంటాయని చదువరులకు అనిపిస్తుంది. తమ సోదరులైన నారా రామ్మోహన్ ను రాజకీయాలకు దూరం చేయడం. తోడల్లుడు దగ్గుబాటిని రాజకీయంగా అణగద్రొక్కడం. అధినేత కుమారుడు హరికృష్ణను దరిచేరనివ్వకపోవడం. ఎన్టీయార్ ను వివాహం చేసుకున్న లక్ష్మీపార్వతిని పార్టీ నుంచీ అవమానకరరీతిలో పంపించడం. కుమార్తె పురందేశ్వరి టిడిపి శత్రువైన కాంగ్రెస్ లోకి వెళ్ళే పరిస్థితులు కల్పించడం.తన కుమారుడు నారా లోకేష్ కు పోటీ కాకుండా యువకిశోరం జూనియర్ ఎన్టీయార్ ను ఒక కంట కనిపెడుతూ ఉండడం  గిరుక్కున చదువరుల మదిలో మెదలుతాయి.   కేవలం తన కుమారునికి పిల్లనిచ్చిన బాలకృష్ణను మాత్రమే ప్రక్కన ఉంచుకోవడం జ్ఞప్తికి వస్తాయి. 


ఋజోర్మృదోర్వదాన్యస్య హ్రీమతః సత్యవాదినః|
నాన్యో జ్ఞాతేర్మహాబాహో వినాశమభినందతి||


నేతకు శుభకరమైన గుణాలు ఋజుత్వం, మార్దవం, వదాన్యత, సిగ్గుపడడం, సత్యవాదిత్వం. ఇవి దైవీ సంపదలు. ఇవి ఉన్న గుణగణాలున్న నేత చావును కేవలం జ్ఞాతులే కోరుకుంటారని భీష్ముడు చెప్పాడు.  నేత ఎంతటి గొప్పవాడైనా అతని అభ్యున్నతిని బంధువులు కోరుకోరని భీష్ముడు చెప్పాడు. 
అలాగని జ్ఞాతులను దూరం కూడా పెట్టకూడదన్నాడు.


అజ్ఞాతినోऽ పి న సుఖాః నావజ్ఞేయాస్తతఃపరమ్|
అజ్ఞాతిమంతం పురుషం పరే చాభిభవంత్యుత||


ఎందుకంటే జ్ఞాతులు లేనివారు సుఖపడతారనే గ్యారంటీ లేదన్నాడు. పైగా వారిని అవహేళన చేయరాదన్నాడు. జ్ఞాతుల బలం లేని వారిని శత్రువులు తేలిగ్గా జయిస్తారు. బంధువులు, రక్తసంబంధీకులు సుఖపడతారనే గ్యారంటీ లేదని భీష్ముడు చెప్పడాన్ని కూడా నారా రాజకీయాలు నిరూపిస్తాయి. ఇది చాలా ముఖ్యం. జ్ఞాతులు లేకుండా అనాథల్లా ఉన్నవారికి తగిన భద్రత ఉండదు. వారిని శత్రువుల తేలిగ్గా సంహరిస్తారు. ఇది నవీన కాలంలో నిజం. తంతే అడ్డువచ్చేవాడు లేడు అని తెలిసిన రోజున శత్రువులు తేలిగ్గా మట్టుపెడతారు.  అయితే ఇక్కడ భీష్ముడు చెప్పిన మరో సూత్రం నారావారి విషయంలో నిరూపణైంది. జ్ఞాతులను పదవీ భయంతో దూరం చేసుకుంటే ఇతరులు తేలిగ్గా అవమానిస్తారనడానికి సాక్ష్యాలు ప్రత్యక్షంగా ఉన్నాయి.


దగ్గుబాటి వెంకటేశ్వరరావును రెండు కాంగ్రెస్ పార్టీలూ దరిచేర్చుకోవడం. రామారావు కుమార్తెకు కేంద్రమంత్రి హోదానివ్వడం, లక్ష్మీపార్వతికి వైకాపా  కార్యదర్శి పదవి ఇవ్వడం కూడా గమనార్హం. అంతేకాక నేడు నారావారికి చెవిలోని జోరీగ...ఇంటిలోని పోరు మాదిరిగా సమాధానం చెప్పలేని ప్రశ్నలుగా వీరు నిలవడం గమనార్హం. అతి తేలిగ్గా నారావారిని అవమానించడానికి వీరి పేర్లను ప్రతిపక్షాలు నేటికీ వాడుకుంటున్నాయి. నందమూరి వంశంలో  ఎవరినీ తెలుగుదేశంలోకి రానివ్వరని, పార్టీని బలోపేతం చేయడని తెలిసి ఆయన వైరిపక్షాలు అన్నీతానైన చంద్రబాబును ఒక్కరినీ దెబ్బతీసి తేలిగ్గా టిడిపిని మట్టికరిపించాయి. 


నికృతస్య నరైరన్యైః జ్ఞాతిరేవ పరాయణమ్|
నాన్యైర్నికారం సహతే జ్ఞాతిర్ జ్ఞాతేః కథంచన||


ఇతరుల చేత అవహేళన పొందిన జ్ఞాతికి మళ్ళీ జ్ఞాతియే దిక్కు. జ్ఞాతి కీడును జ్ఞాతిని మించి ఇతరులు పట్టించుకోరు. ఇది చాలా ముఖ్యమైంది. నేడు పతనమైన తెలుగుదేశం ముందు రెండే మార్గాలున్నాయి. దెబ్బతిన్న నారావారి ప్రతిష్ఠ నుంచీ పార్టీని ఉద్దరించాలంటే దూరమైన ఎన్టీయార్ జ్ఞాతులను దరిచేర్చుకోవడమే మార్గమని కొందరు సూచిస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీయార్ కు పగ్గాలు అప్పగించాలని అంటున్నారు. అయితే లోకేష్ ను పణం పెట్టి అది జరగుతుందా? కనీసం పార్టీ ప్రచారబాధ్యతలైనా ఇస్తారా? అనేది పార్టీ వర్గాలు ఎదురుచూస్తన్న సమాధానాలు. 


ఇదే శ్లోకంలో రెండో పాదం అతిముఖ్యమైంది. జ్ఞాతికి కీడు జరిగితే సంతోషించే వాళ్ళలో మొదటివారు జ్ఞాతే అవుతాడన్నది ఎంత సత్యంగా భీష్ముడు చెప్పాడో ఇప్పుడు దీనికి విరుద్ధమైనది కూడా చెబుతున్నాడు. జ్ఞాతికి కీడు జరిగితే ఎక్కువగా ఆరా తీసేవాడు జ్ఞాతే అవుతాడు. ఎందుకంటే జ్ఞాతుల పూజ్యాపూజ్యాలు సరాసరి ఆ కుటుంబాల మీద పడతాయి కనుక బాధపడేవారు కూడా జ్ఞాతులే అవుతారు.


ఆత్మానమేవ జానాతి నికృతం బాంధవైరపి|
తేషు సంతి గుణాశ్చైవ నైర్గుణ్యం చైవ లక్ష్యతే||


మరో అతిముఖ్యమైనది కూడా భీష్ముడు చెబుతున్నాడు. జ్ఞాతుల్లో గుణాలు, మంచితనాలు, శుభాలు  ఎన్ని ఉంటాయో అన్నే దుర్గుణాలు, చెడ్డలూ, అశుభాలూ ఉంటాయని భీష్ముడు చెప్పాడు. కనుక జ్ఞాతులను చేరతీయాలా? చేరతీయకూడదా? అనేది విజ్ఞతకే వదిలేశాడు. అంతేకాక, జ్ఞాతికి అవమానాలు కలిగితే తనకు కలిగినట్టే భావిస్తారని కూడా చెప్పారు. కనుకనే బంధువులు తక్షణం స్పందిస్తారు. ముఖ్యంగా పల్లెల్లోని వారు ‘‘మీ వాడికి ఇలా అయిందటగా‘‘ అని ప్రశ్నిస్తారు కనుక ఇది అందరికీ అనుభవంలోకి వచ్చే అంశమే.


నా జ్ఞాతిరనుగృహ్ణాతి న చాజ్ఞాతిర్నమస్యతి|
ఉభయం జ్ఞాతివర్గేషు దృశ్యతే సాధ్వసాధు చ||


ఇతరులు మన్నిస్తారు, మన్నించరు. కానీ జ్ఞాతులు ఇష్టం ఉన్నా లేకున్నా కనిపించినప్పుడు కనీసం చూపైనా నిలుపుతారు. మనవాడు అనే మమకారం ఎక్కడో లోపలి పొరల్లో తప్పక ఉంటుంది. దీన్ని పైకి తెచ్చి నిలుపుకొన్నవాడు గొప్పవాడు. చేరవచ్చిన జ్ఞాతులను కూడా దూరం చేసుకునే వాడు త్వరగా పతనం అవుతాడు. మంచి చెడులు రెండూ జ్ఞాతుల వర్గాలలో కనిపిస్తాయని అన్నాడు.   


సమ్మానయేత్పూజయేచ్చ వాచా నిత్యం చ కర్మణా|
న హి దోషో గుణో వేతి నిరూప్యస్తేషు దృశ్యతే||


జ్ఞాతులతో, బంధువులతో, రక్తసంబంధీకులతో ఎలా ప్రవర్తించాలో భీష్ముడు అద్భుతమైన సలహా ఇస్తున్నాడు.
ప్రపంచంలో ఎవరు వచ్చి ఏం అడిగినా ఆలోచించకుండా లేదు ఉంది అవును కాదు అనవచ్చు. కానీ బ్రతకనేర్చిన వాడు బంధువులు వచ్చినప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీరాలి. ఎందుకంటే వారిని మనోవాక్కాయకర్మల్లో మాటలు, పనులు చేత బాధించరాదని బంగారు సూత్రం భీష్ముడు చెప్పాడు. వారిని సముచిత స్థానంలో తగురీతిగా సన్మానిస్తూ ఉండడమే క్షేమకరం అని చెప్పాడు. 


విశ్వస్తవదవిశ్వస్తః తేషు వర్తేత సర్వదా|
న హి దోషో గుణో వేతి నిరూప్యస్తేషు దృశ్యతే||


ఇదీ మరీ ముఖ్యంగా నేతలు అవలంబించాల్సిన పద్ధతి అని మరో సువర్ణారక్షరాలతో రాసుకోదగినదిగా చెప్పాడు.జ్ఞాతులను నమ్మినా, నమ్మకపోయినా వారితో సంపూర్తి నమ్మికతో వ్యవహరిస్తున్నట్టు కనిపించమన్నాడు. వారిలో గుణ దోషాలు కనిపించినా ఆటలో అరటి పండులా తీసేయాలి కానీ వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వవద్దన్నాడు.ఇది చాలా ముఖ్యం. ఒక జ్ఞాతి తప్పు చేస్తే నువ్వు తప్పుచేశావు అని చెబితే అతడు కష్టపడతాడు. అలాగే అతడు మహామంచి పని చేస్తే, నువ్వు మంచి పని చేశావు అని చెబితే అతడు అధికారమండలిలో పెరిగిపోయే అవకాశం ఉంది. కనుక వారిని తన కళ్ళ ముందు ఉంచుకుంటూనే చూసీ చూడనట్టు వదిలేయాలన్నమాట.


అయితే ఇవేవీ చంద్రబాబు పాటించలేదు. చాలా క్రూరంగా నందమూరి వంశాన్ని అణిచి వేశాడని పరిశీలకులు అంటారు. ఇక్కడే రాజనీతి పాటించిన కాంగ్రెస్, బిజెపి, వైకాపాలు వారిని చేరదీసి బాబుకు వ్యతిరేకంగా  ఉపయోగించుకున్నాయి. అవే మాటలు సామాన్యులు అనేదానికన్నా బంధువులు అనడం వల్ల వాటికి  ఎక్కువ విలువ ఉంటుంది కనుక బాబుకు మాటలు తూటాలై నాటుకున్నాయి.  అదే ఆయన పార్టీకి గొడ్డలిపెట్టు అయింది.


అస్యైవం వర్తమానస్య పురషస్యాప్రమాదినః|
అమిత్రా సంప్రసీదంతి తథా మిత్రీభవంత్యపి||


భీష్ముడు తాను చెప్పిన రాజనీతి పాటిస్తే కలిగే ప్రయోజనం కూడా చెబుతున్నాడు. ఈ విధంగా చేయడం వలన శత్రువులు తగ్గిపోతారని చెప్పాడు. అంతేకాక మిత్రులు పెరుగుతారని అన్నాడు. తాను చెప్పినట్టు బంధువులతో జాగ్రత్తగా మెలిగితే  మిత్రులు, శత్రువులు, తటస్ఠులలో కూడా చిరకీర్తితో మెలగుతాడని చెప్పాడు. ఇక్కడే మరో విషయం కూడా గమనించాలి. కేవలం సన్నిహితుల స్థాయిలో రామారావు, లక్ష్మీపార్వతీలకు దగ్గరైన మోహన్ బాబును నారావారు దూరం చేసుకున్నారు. ఆయన తదనంతరం వైఎస్ కుటుంబంతో బంధుత్వం రావడం వలన గత ఎన్నికల్లో అనేక పర్యాయాలు వైకాపా విజయాన్ని కోరుకున్నారు. 


బంధువులను జ్ఞాతులను పోగేసుకొని తనకంటూ బలాన్ని పెంచుకోవడంలో బాబుకన్నా జగన్ ముందున్నాడనే చెప్పాలి. ముఖ్యంగా తల్లి, చెల్లి, భార్య, రక్తసంబంధీకులు అందర్నీ కూడబెట్టుకున్నాడు. చిన్నాన్న అయిన వైవీ సుబ్బారెడ్డిని తన మాటకు కట్టుబడేలా చేసుకున్నాడు. బాలినేని  శ్రీనివాసరెడ్డినీ, భూమన కరుణాకర్ రెడ్డి వంటివారి సేవలు కూడా ఎలా ఉపయోగించుకుంటారని చాలామంది ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే వివేకానంద మరణంలో ప్రజలకు ఉన్న కొన్ని సందేహాలు తీర్చాల్సి ఉంది. 


బంధువులను దరిచేరనివ్వడం వలన ఎంతటి వారికైనా తిప్పలు తప్పవని నిరూపితం అవుతూనే ఉంది. మేనల్లుడు హరీష్ రావు, కేసీఆర్ల మధ్య చిచ్చుపెట్టాలని గతంలో కొందరు ప్రయత్నించారు. మీడియా కూడా అధికంగానే ప్రచారం చేసింది. అయితే కేసీయార్ దాన్ని సమర్థవంతంగా అణిచివేశారు. మహారాష్ట్రలో తిరుగులేని నేత శివసేన అధ్యక్షుడు థాక్రేకు కూడా జ్ఞాతిపోటు తప్పలేదు. సోనియాకు తోడికోడలు మనేకా గాంధీ, వరుణ్ గాంధీలు కంటిలో నలుసులా తగులుతూనే ఉన్నారు. నేడు గెలిచిన వీరు రేపు పార్లమెంటులో కూడా బిజెపీ రూపంలో అడ్డుతగలబోతున్నారు. 

 
ఇక తమిళనాడులో కన్నిమోళి, స్టాలిన్, సోదరుడు అళగిరి సమరాలు ముందుముందు ఉద్ధృతం కాబోతున్నాయి. దేవెగౌడ తదనంతరం కుమారులు కూడా కత్తులు తీయనున్నారు.  కాంగ్రెస్ లోకి వెళ్ళి అక్కడి నుంచీ బిజెపీకి వెళ్ళిన పురందేశ్వరిని వదిలిపెడితే, పార్టీ ఆవిర్భావం నుంచీ వెన్నుదన్నుగా నిలిచిన రామారావు సతీమణి లక్ష్మీపార్వతి వైకాపాకు ఒక మూల స్తంభంగానే చెప్పాలి. నిజానికి ఆమె ప్రాభవం టిడిపిలో కొనసాగి ఉంటే అనంతసాహితి ఈ ఉద్యమం ఇంత సుదీర్ఘకాలం చేయాల్సి వచ్చేది కాదు. ఆమె ప్రాచ్యభాషా కళాశాలల పక్షపాతి. ఈ సమస్యమీద సంపూర్తి సమాచారం అవగాహన ఉన్న వారు. ఇప్పుడు కార్యదర్శి స్థాయిలో సుదీర్ఘకాలం పార్టీకి సేవ చేసినామెకు సముచితస్థానం పార్టీ ఇవ్వవలసి ఉంది. దీని వలన ఆమె ప్రాచ్యభాషలకు మేలు చేస్తారని, మా ఉద్యమానికి సహకరిస్తారని భావిస్తున్నాము. 


ఇక చంద్రబాబు తోడల్లుడు వెంకటేశ్వరరావు ఓడిపోయినా వారి సేవలు ప్రజాసంబంధంలో ఏదో రకంగా పార్టీ వినియోగించుకుంటారని చాలా మంది భావిస్తున్నారు. ఇంటిగుట్టు తెలిసిన వీరు బాబును ఎదుర్కోవడానికి సాయపడతారని కొందరు భావిస్తున్నారు. రాచరికం గురించి భీష్ముడు చెప్పాడు. నేడు ప్రజాస్వామ్యం నడుస్తోంది. కానీ రాచరికంలోని వంశపారంపర్య, బంధుప్రీతి రాజకీయాలు ప్రజాస్వామ్యంలో కూడా కొనసాగడం దురదృష్టకరం. అయితే వీరిలో వచ్చే లుకలుకలే ప్రజాస్వామ్యానికి రక్షగా పరిణమిస్తుండడం కొంత ఊరడించే అంశం.


భీష్ముడు చెప్పిన రాజనీతి యుగాలు మారినా ఆచరణయోగ్యంగా ఉండడం ఆశ్చర్యపోవలసిన అంశం. నేడు ప్రజలు చాలా విజ్ఞతతో ఉన్నారని గురువారం నిరూపణ అయింది. ముఖ్యమంత్రిగా జగన్ బైబిల్ ను ప్రక్కనే ఉంచుకొని సంతకం చేశారని కొందరు మనోభావాలు రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. ఇది చాలా దురదృష్టకరపరిణామం. నిజానిజాలతో పనిలేకుండా ఇంకాపుట్టని ప్రభుత్వంపై అధర్మయుద్ధాలు చేయడం మేము ఖండిస్తున్నాము. 


క్రొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి కనీసం ఆరునెలల సమయం ఇస్తారు. దీన్ని పాత్రికేయ భాషలో హనీమూన్ సమయం అంటారు. దీన్ని కూడా కాలరాచి ప్రమాణస్వీకారం కావడానికి ముందే ప్రత్యేక హక్కు సాధిస్తారా లేదా అనే చర్చలు పెట్టి కేంద్రంతో ఉన్న సత్ సంబంధాలు చెడగొట్టాలని ప్రయత్నించే పనుల కొన్ని మీడియాలు చేశాయి. అటు సామాజిక మాధ్యమాల్లో, ఇటు అచ్చోసిన పత్రికలలో, గొట్టపు మీడియాల్లో చేస్తున్నారు.  


సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి తగిన సమయం ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వంలో ఉన్న అనుభవజ్ఞులకు అవకాశం ఇవ్వాలి. ప్రాచ్యభాషా సమస్యల పరిష్కారానికి లక్ష్మీపార్వతి వంటి అనుభవజ్ఞులు ఉన్నారు కనుక మేము ఆరు నెలలు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాము. ఈ లోగా ప్రభుత్వం ఈ సమస్య మీద దృష్టిపెట్టకపోతే కార్యాచరణ నిర్మించుకొని ఆ తరువాత ముందుకు వెళతాము. ఇది సరైన పద్ధతి. నిజానికి బాబుతో కలసి సంస్కృతకళాశాలలకు ద్రోహం చేసినవారు వైకాపా చేరారు. అయినా మేం సమయమనంతో ఉన్నాము.

 

ఈ పాటి సంయమనం లేని వారు పైశాచిక రాజకీయాలు చేస్తున్నారు. వీటిని ప్రజలే త్రిప్పి కొట్టాలి. కనుక ప్రజలకు సనాతనమైన జ్ఞానాన్ని అందివ్వాలని వారికి అత్యంత ఇష్టమైన రాజనీతిని అందిస్తున్నాము. ఈ ఆరు నెలలూ ఈ సనాతన రాజనీతి ప్రచారం కొనసాగుతుంది.  
 ఇది మీకు నచ్చితే మమ్మల్ని ప్రోత్సహించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: