బొత్స సత్యనారాయణ.. వైసీపీలో చాలా సీనియర్ నేత. జగన్ కేబినెట్‌లో కీలక మంత్రి కూడా. కీలకమైన శాఖ కూడా నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా మంత్రి బొత్స సత్యనారాయణ సైలంట్‌గా కనిపిస్తున్నారు. పెద్దగా హడావిడి కూడా లేదు. అసలు ఉన్నారా.. ఎక్కడికైనా వెళ్లారా అన్నట్టుగా ఉంది ఆయన ఉనికి. మరి మంత్రి బొత్స ఎందుకు ఇలా సైలంటయ్యారు.. ఎందుకు పెద్దగా మీడియా ముందుకు కూడా రావడం లేదు అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బొత్స సత్యనారాయణ గతంలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయం  తర్వాత బొత్స మరింత యాక్టివ్ అయ్యారు. తరచూ మీడియా సమావేశాలు నిర్వహించి.. మూడు రాజధానుల నిర్ణయాన్ని డిఫెండ్ చేసేవారు. తరచూ అమరావతి అంశంపై కామెంట్లు చేసేవారు. అంతే కాదు.. విశాఖ కేంద్రంగా వైసీపీ సర్కారు నిర్ణయాలు పెరిగాక మంత్రి బొత్స జోరు.. ఇంకాస్త పెరిగింది. విశాఖను ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నదీ.. ప్రభుత్వ ప్రణాళికలు అన్నీ వివరస్తూ ప్రెస్ మీట్లు పెట్టేవారు.

కానీ.. కొంత కాలంగా మంత్రి బొత్స ఎక్కడా కనిపించడం లేదు. ఆయన వాయిస్ పెద్దగా వినిపించడం లేదు. మూడు రాజధానుల నిర్ణయం అమలులో విపరీతమైన జాప్యం జరుగుతోంది. అది ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు. పులి మీద పుట్రలా ఏపీని కరోనా వైరస్ వేధిస్తోంది. దీంతో మూడు రాజధానుల నిర్ణయం అమలు అంశం ఇప్పుడు ప్రాధాన్యం కోల్పోయింది. బహుశా.. అందుకే మంత్రి బొత్స వాయిస్ వినిపించడం లేదేమో అన్న వాదన వినిపిస్తోంది.

దీనికి తోడు... మంత్రి బొత్స సైలెన్స్ కావడానికి రాజకీయంగా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.  జగన్ సర్కారులో ఏ మంత్రికి ఎప్పుడు ప్రాధాన్యత లభిస్తుందో తెలియదన్న వాదన కూడా ఉంది. ఏదేమైనా పార్టీలోనే సీనియర్ అయిన మంత్రి బొత్స మాత్రం కొంతకాలంగా సైలంట్‌గా ఉన్నారు. మళ్లీ ఆయన ఎప్పుడు ఫామ్‌లోకి వస్తారో.. ఏమో.. చూడాలి.. ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: