తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంత దీన‌ స్థితిలో ఉందో మనకు తెలిసిందే. అయితే మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే ఆ పార్టీ కాస్త పుంజుకుంటోంది. రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తూ ఉండటంతోపాటు కీలక నేతలను ఒకే తాటి మీదకు తీసుకువస్తున్నారు. రేవంత్ ఓ వైపు ఎంత కష్టపడుతున్నా... కొందరు సీనియర్ నేతలు మాత్రం ఆయ‌న‌ను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు. అసలు పార్టీకి మిగిలిందే ఆరుగురు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను కూడా కొందరు నేతలు టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు.

తాజాగా మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ లో కోల్డ్ వార్ న‌డుస్తోంది. ఇల్లందు లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే గా ఉన్న డిసిసి అధ్యక్షుడు పోదెం వీర‌య్య‌ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. మహబూబాబాద్ మాజీ ఎంపీ బలరాం నాయక్ ను ఉద్దేశించి ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు అందుబాటులో లేకపోవటం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయారు అని... ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని బలరాంనాయక్ ను హెచ్చరించారు.

అయితే కాంగ్రెస్ లో వీరయ్య కు వ్యతిరేకంగా ఉన్న మరో వర్గం ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. స్థానికేతరులు ఎవరు ముందుగా వీర‌య్యే తేల్చుకోవాలని హెచ్చరించింది. ములుగుకు చెందిన వీర‌య్య‌ భద్రాచలం నుంచి పోటీ చేయలేదా అని వారు ఆరోపించారు. అయితే ఇక్కడ లెక్క మరోలా ఉంది. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పట్టుబట్టడంతో ములుగు సీటు సీతక్క కు ఇచ్చారు. అప్పుడు వీరయ్య భద్రాచలం వెళ్లి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

అందుకే వీరయ్య రేవంత్ రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ వచ్చే ఎన్నికల నాటికి తిరిగి కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం కూడా ఉంది. ఆమె తిరిగి పార్టీలోకి రాకుండా ఉండేందుకే ఆయ‌న‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని పార్టీ వర్గాల్లో మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు ఉండటం టీ కాంగ్రెస్‌కు మైనస్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: