ఉక్రెయిన్ రష్యా దాడి నేపథ్యంలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలను దేశ ప్రజలకు చేరవేసేందుకు వైట్ హౌస్ ప్రతినిధులు కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. టిక్ టాక్, యూట్యూబ్ తదితర ప్లాట్ ఫామ్స్ లలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న 30మందితో వైట్ హౌస్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రష్యా అణ్వాయుధ బెదిరింపులను తట్టుకొని.. ఉక్రెయిన్ కు అమెరికా ఎలా సాయం చేస్తుందో వీరు ప్రచారం చేయనున్నారు.

ఇక ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధం కారణంగా అమెరికా, చైనా నేడు రోమ్ లో భేటీ కానున్నాయి. యుద్ధంపై రష్యా చేస్తున్న ప్రచారం, ఆ దేశంపై ప్రపంచ దేశాలు విధిస్తున్న ఆంక్షలు లాంటి అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి. అమెరికా తరఫున జాతీయ భద్రతా సలహాదారుడు జాక్ సులివన్, చైనా నుంచి విదేశాంగ విధాన సలహాదారుడు యాంగ్ జీచీ హాజరుకానున్నారు.

రష్యా దాడులో ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న సంక్షోభం తీవ్రమయ్యే అవకాశముందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. దీనికి ముగింపు పలికేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడేందుకు అమెరికాలో ఎవరూ లేరని విమర్శించారు. పిరికితనం, అసమర్థత లాంటి బలహీనతలు ప్రెసిడెంట్ బైడెన్ కు ఉన్నాయన్నారు. ఉక్రెయిన్ విషాదానికి ముగింపు పలికేందుకు మార్గాలున్నాయని తెలిపారు. రష్యాకు ధీటుగా అమెరికా స్పందించాలని సూచించారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఇజ్రాయేల్ ప్రధానితో జెలెన్ స్కీ మాట్లాడారు. జెరుసలేంలో పుతిన్ తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. లీవ్ కు సమీపంలోని మిలటరీ ట్రైనింగ్ సెంటర్ పై రష్యా వైమానిక దాడిలో 9మంది మరణించగా.. 57 మంది గాయపడ్డారు.

ఇక ఉక్రెయిన్ పై రష్యా దాడిని నిరసిస్తూ అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షలతో అనేక విదేసీ కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేశాయి.
దీంతో వేలమంది రష్యన్లు ఉపాధి కోల్పోనున్నారు. ఇలాంటి కంపెనీలను వేలం వేసి ఇతర సంస్థలకు వాటి నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు పుతిన్ సర్కారు కొత్త  చట్టం తీసుకురానుంది. దీన్ని ఉపయోగించి.. ఆ కంపెనీలను పూర్తిగా లేదా 25శాతం వాటాతో స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది.












మరింత సమాచారం తెలుసుకోండి: