తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్లారు. తెలంగాణలో  పెట్టుబడుల కోసం కేటీఆర్ అమెరికా టూర్ ప్లాన్ చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ పాటిస్తున్న విధానాల గురించి అక్కడి సంస్థలకు వివరించనున్నారు. తెలంగాణ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందని.. అక్కడ పెట్టుబడులు  పెడితే మంచి ప్రయోజనం ఉంటుందని వివరించి ఎన్‌ఆర్‌ఐలు, పలు పరిశ్రమల యాజమాన్యాలను ఆహ్వానించనున్నారు. తెలంగాణలో ఏ ఏ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయో వివరించనున్నారు మంత్రి  కేటీఆర్.


ఇప్పటికే తెలంగాణలో అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ సంస్థలను  ఏర్పాటు చేశాయి. ఇప్పటికే అమెజాన్, ఫేస్‌బుక్‌, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ సంస్థలు హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. తమ వ్యాపార విస్తరణకు  హైదరాబాద్‌ను చిరునామాగా ఎంచుకున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగంతో పాటు ఫార్మా, ఆటోమోబైల్, టెక్స్‌ టైల్స్, బయో, లైఫ్ సైన్సెస్‌ వంటి కీలక రంగాల్లోనూ హైదరాబాద్ మంచి పురోగతి సాధిస్తోంది. ఈ రంగాల్లో మరిన్ని సంస్థలు వస్తే హైదరాబాద్ మరింతగా అభివృద్ధి చెందుతుందన్నది కేటీఆర్ ప్లాన్.


మరిన్ని పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా సాగుతున్న మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ఈనెల 26 వరకు కొనసాగుతుంది. ఇదే సమయంలో కేటీఆర్‌ ప్రవాసాంధ్రులతో ప్రత్యేక సమావేశం అవుతారు. పెట్టుబడులతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా తీసుకున్న  మన ఊరు – మన బడి పథకానికి ఎన్ఆర్ఐల నుంచి విరాళాలు  కూడా సేకరించనున్నారు.  ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేస్తే ఆయా పాఠశాలలకు వారి పేర్లు పెడతామని చెబుతోంది.


పాఠశాలకు కోటి రూపాయలు లేదా ఆపైన విరాళం ఇచ్చే దాతల పేరును బడికి పెట్టేందుకు తెలంగాణ సర్కారు ముందు కొచ్చింది. 20 లక్షలు విరాళం ఇస్తే దాత పేరును ఒక తరగతి గదికి పెడతారు. చాలా మంది ప్రవాసాంధ్రులు.. వారి స్వగ్రామాల్లోని పాఠశాలకు చేయూత ఇస్తే.. వాటిని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: