తెలుగుదేశంపార్టీ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై సస్పెన్షన్ వేటుపడిన  ఎంఎల్ఎల విషయంలో తెగ బాధపడిపోతోంది. పోలింగులో క్రాస్ ఓటింగ్ చేసింది వైసీపీ ఎంఎల్ఏలు, వేటువేసింది వాళ్ళపార్టీ అధిష్టానం.  మధ్యలో టీడీపీకి వచ్చిన సమస్య ఏమిటో అర్ధంకావటంలేదు. ఎవరైనా ఎంఎల్సీ పోలింగ్ లో క్రాస్ ఓటింగ్ జరిగింది, పలానా వాళ్ళు క్రాస్ ఓటింగుకు పాల్పడ్డారని అంటే వెంటనే అన్నవాళ్ళని అరెస్టుచేయాలట.





టీడీపీ డిమాండ్ వినటానికే విచిత్రంగా ఉంది. 19 ఓట్ల బలంతో పోటీచేసిన టీడీపీ అభ్యర్ధికి 23 ఓట్లొచ్చాయి. అంటే వైసీపీ నుండి నలుగురు ఎంఎల్ఏలు టీడీపీ అభ్యర్ధికి ఓట్లు వేసినట్లు తేలిపోయింది. దీంతో క్రాస్ ఓటింగ్ జరిగిందని వైసీపీ అధిష్టానం నిర్ధారణ చేసుకున్నది. ఓటింగ్ అప్పుడు ప్రతి ఎంఎల్ఏకి నాయకత్వం ప్రత్యేకమైన కోడ్ ఇచ్చింది. దానిద్వారా సరిపోల్చుకుని ఎవరు క్రాస్ ఓటింగుకు పాల్పడ్డారో పసిగట్టింది. దాంతో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేసింది.





పైన చెప్పిందంతా పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారం. దీంతో టీడీపీకి ఎలాంటి సంబంధంలేదు. అలాంటిది క్రాస్ ఓటింగ్ చేసిన ఎంఎల్ఏలకు మద్దతుగా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. ఎవరు క్రాస్ ఓటింగుకు పాల్పడ్డారన్నది వైసీపీ నాయకత్వానికి ఎలా తెలుసంటు ప్రశ్నించారు. టీడీపీకి ఎవరు ఓట్లేశారో ఎవరికి తెలుసంటు నిలదీశారు. ఆత్మప్రభోదానుసారం ఓట్లేశారేమో అని వితండవాదం వినిపించారు. ఎందుకు ఓట్లేశారన్నది వేరే సంగతి. టీడీపీకి ఓట్లేశారా లేదా అన్నదే ప్రధానం.





క్రాస్ ఓటింగ్ చేసిందో ఎవరో తనకు తెలసని ఎవరైనా అంటే వాళ్ళని అరెస్టు చేయాలట. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వాళ్ళ పేర్లు చెప్పటమంటే రహస్య బ్యాలెట్ స్పూర్తిని ఉల్లంఘించటమేనట. అలాంటి వాళ్ళపై వెంటనే కేంద్ర ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయటమే విడ్డూరంగా ఉంది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎంఎల్ఏలకి టీడీపీ మద్దతుగా నిలబడుతోందా ? ఆ నలుగురిపై నిజంగా అంత ప్రేమే ఉంటే వాళ్ళని వెంటనే పార్టీలో చేర్చుకుని టికెట్లు ఖాయం చేయచ్చు కదా ?


మరింత సమాచారం తెలుసుకోండి: