రాష్ట్ర కాంగ్రేస్ కష్టాలకు కారణమేమిటి, వాటినుంచి బయటపడడమెలా అనే పరిశోధన కోసం మంత్ని ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో వేసిన మంత్రుల కమిటి వాటిని శోధించి ఎట్టకేలకు ధర్మాన తన ‘ధర్మ‘ సందేశాన్ని అందచేశారు. పంచాయతి ఎన్నికలకు వెలితే నష్టం, పథకాలను పకడ్బందీగా అమలుచేయడం కష్టంగా ఉన్న ప్రస్తుత పరిస్థతుల్లో ఇది సందేశమో...పార్టీన బాగుచేయడంపై వెలిబుచ్చిన సందేహమో తెలియక అయోమయంలో పడ్డారు కాంగ్రేస్ నేతలు . బయటపడుతున్న అవినీతి మంత్రులు,మద్యంతో సహా పలు అక్రమవ్యాపారాల్లో వెలుగు చూస్తున్న పార్టీ ఎమ్మేల్యేలతో పాటు ప్రముఖనేతల పాత్రతో ప్రజల్లో పట్టు కోల్పోయి ఉంది. తెలంగాణ సమస్యతో ఈప్రాంతంలో ఎన్నికల్లో పోటీకి నిలబడడానికి పార్టీనాయకులు కూడా ముందుకు రాని స్థితి చాలా చోట్ల నెలకొని ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీని గట్టిగా ఉంచాలన్నా, పథకాల అమలులో సొంతపార్టీవారికి లబ్ది చేకూరాలన్న, పార్టీ కార్యక్రమాలు అమలు కావాలన్న సర్పంచ్ లే కీలకం. ఇలాంటి తరుణంలో ధర్మసందేశంలోని అత్యంత ప్రధాన సూచన అమలుచేయడం పార్టీకి తీరని నష్టాన్ని తేవడం తప్ప లాభం తెచ్చే అవకాశాలు లేవు. రెండవ ప్రధాన అంశం సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలుచేయడం,బీసీలు,ఇతరత్ర బడుగు బలహీనవర్గాల వారి కోసం కొత్తవి అమలుచేయడం. ఖజానా ఖాలీగా ఉన్న తరుణంలో ఉన్నవాటికే నిధులు సరిపోక పూర్తిస్థాయిలో అమలుచేసే పరిస్థితిలో లేదు. మోయలేని భారంతో మొదలుపెట్టిన రూపాయికిలో బియ్యం పథకమే తలప్రాణాన్ని తోకలోకి తెస్తోంది.పైగా ఇది అనుకున్నంత లాభం చేకూర్చలేకపోయింది. ఈతరుణంలో కొత్త పథకాల మాట దేవుడెరుగు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ అంటారా గ్రామానికో రెండు మూడు గ్రూపులతో సతమవుతున్న కాంగ్రేస్ ఇప్పుడు ఈకార్యక్రమాన్ని చేపడితే వారిలోవారే పదవుల కోసం తన్నుకు చచ్చే పరిస్థితి. రెండోసారి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా పదవులు లేక పడిగాపులు కాస్తున్న ఈతరుణంలో ఇవి భర్తీ చేయకున్నా ఇబ్బందే. అమ్మో ఇంకా పూర్తి ధర్మసందేశం లోకి వెలితే ఇలాంటివే ఎన్నో. అంటే మంత్రి ధర్మాన కమిటి పార్టి వైభవం కోసం ధర్మ సందేశాన్ని ఇచ్చిందా... లేక ఇది సాధ్యమెలా అంటూ వెలిబుచ్చిన ధర్మసందేహమా...అన్నది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట కాంగ్రేస్ నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: