హైదరాబాద్: ఫీజు రీయింబర్స్ మెంటుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రెండు రోజుల గడువు ఇచ్చారు. రెండు రోజుల్లో ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుంటే రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనను తీవ్రతరం చేస్తామనీ హెచ్చరిక జారీ చేశారు. పేద విద్యార్థుల జీవితాలతో రాష్ర్ట ప్రభుత్వం ఆటలాడుకుంటుందన్నారు. రాష్ర్ట బడ్జెట్ లక్షా 30వేల కోట్ల రూపాయలనీ, వీటిలో కేవలం విద్యార్థులకు చెల్లించేది 5వేల కోట్ల రూపాయలు మాత్రమేననీ, ఆ మాత్రం కూడా చెల్లించకపోతే ఎలా అని బాబు ప్రశ్నించారు. ఫీజులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకుంటే సరి లేదంటే ఉద్యమాన్ని ఉధ్రుతం చేస్తామనీ హెచ్చరించారు. బుధవారం నాడు ఫీజులపై నగరంలోని కాసు బ్రహ్మానందారెడ్డి పార్కు సమీపంలో విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా బాబు ప్రభుత్వానికి రెండు రోజుల పాటు గడువును విధించారు. రెండు రోజుల్లో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలనీ డిమాండు చేశారు. లేదంటే రాష్ర్ట వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్దయెత్తున ఉద్యమాన్ని చేపడుతామనీ హెచ్చరించారు.  తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యార్థులకు విద్యా, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండేవనీ ఇప్పుడు ఆపరిస్థితులు లేవన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. పేద విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదన్నారు. కాసు బ్రహ్మానందారెడ్డి పార్కు వద్ద ధర్నా ముగిసిన తరువాత విద్యార్థులతో కలిసి సచివాలయంలోని మంత్రుల కార్యాలయాలను ముట్టడిచేందుకు వెళ్లేందుకు బయలుదేరిన బాబును పోలీసులు అడ్డుకున్నారు. దీనితో బాబు విద్యార్థులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. దీనితో ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడ్డది. పోలీసులు బాబును బలవంతంగా బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: