వరి పెట్టుకుంటే ఉరి పెట్టుకోవడమేనని వ్యవసాయరంగంలో మునిగితేలుతూ చివరకు అప్పుల పాలయిన రైతులు అనుభవంతో చెప్పిన మాటలివి. నాడు మోటకొట్టి, నిన్నఇంజన్ పెట్టి, కరంటు కోతతో కుమిలిపోతినినేడు, రైతుబతుకు నాది పాడుగాను అంటూ ఆవేదనతో కవి రాసిన పధ్యం పదేపదే గుర్తుకు వస్తుంది. 70శాతం మంది ప్రజలు గ్రామాల్లో ఇప్పటి వరకు వ్యవసాయరంగంపై ఆదారపడి జీవనం సాగిస్తున్నారు. కాగా వరుసగా కొన్ని సంవత్సరాలుగా వర్షాలు కురియక పోవడంతో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వ్యవసాయంపై ఆదారపడిన రైతులు పాతాళ గంగను పైకి రప్పించడం కోసం లక్షల రూపాయలు వెచ్చించి బోర్లు వేశారు. ఒక్కోరైతు తన స్థాయికి మించి బోర్లు వేసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండగా ఇప్పుడు కరంటు కష్టాలు ప్రారంభమయ్యాయి. రైతాంగానికి 7గంటల పాటు విధ్యుత్ ను సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం పదేపదే చెబున్నప్పటికిని ఆచరణలో అమలు కావడం లేదు. దీంతో రైతులు పోసినటువంటి వరి నారుమళ్లు కరంటు రాక, నీళ్లు లేక నాటుకు వచ్చి పెరిగిపోతుంది. ఇది వరకు నాటిన వరి పంటలు ఎండి పోతున్నాయి. కొన్ని జిల్లాల్లో కేవలం బోర్లపై ఆదారపడి వ్యవసాయం చేస్తున్నారు. అయితే భూగర్భజలాలు అడుగంటి పోవడంతో బోర్లు సైతం సన్నగా గ్యాప్ ఇచ్చుకుంటూ పోస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 7గంటల పాటు విధ్యుత్ సరఫరా అయితే అరఎకరం పొలం పారుతుంది. కాగా కరంటు కోతతో నారుమళ్లు సైతం ఎండిపోతున్నాయి. ఇప్పటి వరకు కొన్ని జిల్లాల్లో తగిన వర్షాలు కురియక పోవడంతో చెరువు,కుంటల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా భూగర్భజలాలు పూర్తిగా అడుగంటి పోయి రైతుల పరిస్థితి ఆగమ్యగొచరంగా తయారైంది. చాలా మంది రైతులు బోర్లు వేసి నీరు రాక పోవడంతో పాటు ఉన్నటు వంటి వరి పంటలు ఎండి పోయి ఉరితాడుకు వ్రేలాడి చనిపోయినటువంటి సంఘటనలున్నాయి. ఇటువంటి పరిస్థితిలో రైతులకు అండగా తాము ఉన్నామంటూ దైర్యం నింపాల్సిన ప్రభుత్వం ఉన్నటువంటి కరంటులో కోతను విధిస్తుంది. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. బ్లాక్ లో ఎరువులను కొనుగోలు చేసుకున్న రైతులు కొంతమంది ఉంటే, రోజుల పాటు యూరియా కోసం లైన్లో నిలబడి అలసిపోయిన రైతులు మరికొందరు. ఒకరిద్దరు రైతులు ఎరువుల కోసం క్యూలో నిలబడి చనిపోయిన సంఘటనలున్నాయి. ఇన్ని బాధలను అనుభవిస్తున్నటు వంటి రైతులకు దారి చూపించే వారు కరువయ్యారు. తాను రైతు పక్షపాతినంటూ, వరి దాన్యానికి మద్దతు ధర కల్పిస్తామంటూ బహిరంగ వేదికల్లో వాగ్దానాలను గుప్పిస్తున్నటువంటి సిఎం ఇప్పుడున్నటువంటి కరువు పరిస్థితిలో రైతును ఆదుకోవడం కోసం తీసుకోవాల్సిన చర్యలు గూర్చి మరిచి పోయి, అసలు సాగు చేయడానికి అనుకూలించని వరి దాన్యానికి మద్దతు ధర కల్పిస్తామని చెప్పడంతో వరి సాగుచేయని రైతులకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కరువు పరిస్థితిలో రైతులను ఆదుకోవడం దిశగా అడుగులు వేయాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: