టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులోని తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌కవ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి జీరో అవుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌ర‌ఫున గ‌ట్టిగా పోరాటం చేస్తున్న కొండా ఫ్యామిలీ మొత్తంగా ఇప్పుడు వైసీపీ పంచ‌న చేరిపోయింది. టీడీపీ ఆవిర్భావం నుంచి తంబ‌ళ్ల‌ప‌ల్లిలో కొండా గీత‌, కొండా సిద్ధార్థ్‌లు పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కేడ‌ర్‌ను కూడా బ‌లోపేతం చేస్తున్నారు. అయితే, వీరికి త‌గిన విధంగా గుర్తింపు లేద‌ని ఇటీవ‌ల కొంత‌కాలంగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, ఇక్క‌డ పాగా వేయాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ దృష్టి సారించ‌డంతో.. ప‌రిస్తితులు అనుకూలంగా మారాయి. 


వైసీపీ కీల‌క నేత‌లు మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి, ద్వారాకానాథ్ రెడ్డి లు తంబ‌ళ్ల‌ప‌ల్లిలో వైసీపీని బ‌లోపేతం చేసే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నారు.  టీడీపీలో 40 ఏళ్ల పాటు కొనసాగిన కొండా సిద్ధార్థ్‌ కుటుంబాన్ని వైసీపీలోకి చేరేలా చ‌క్రం తిప్పారు. ఈ కుటుంబం పార్టీలో చేర‌డం ద్వారా భారీ ఎత్తున టీడీపీ ఓటు బ్యాంకు వైసీపీకి అనుకూలంగా మారుతుంద‌ని భావించా రు. గ‌డిచిన 40 ఏళ్లుగా తాము.. పార్టీలోనే ఉన్నా.. త‌మ‌కు ఎలాంటి గుర్తింపు లేద‌ని కొండా ఫ్యామిలీ ఆరోపించ‌డం గ‌మ‌నా ర్హం. టీడీపీ విధానాలు న‌చ్చి తాము ఈ పార్టీలో చేరామ‌ని, అయితే, తాము చేరిన నాటికి ఇప్ప‌టికీ మార్పులు క‌నిపిస్తున్నా య‌ని, ముఖ్యంగా కాంగ్రెస్‌కు బ‌ద్ధ వ్య‌తిరేకంగా టీడీపీని స్తాపించార‌ని. అయితే, ఇప్పుడు చంద్ర‌బాబు మాత్రం పోయి పోయి.. టీడీపీని కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టించార‌ని అంటున్నారు. 


ఈ ప‌రిణామంతోనే తాము విసిగిపోయి.. పార్టీకి రాజీనామా చేసిన‌ట్టు చెప్పుకొచ్చారు. చిత్తూరు జిల్లా తాంబల్లపల్లి నియోజకవర్గం పీటీఎం మండలం ఎంపీపీగా ఉన్న కొండా గీతమ్మ, కొండా సిద్ధార్థ్‌ తమ అనుచరులతో కలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి, ద్వారాకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వారు కలిశారు. టీడీపీలో 40 ఏళ్ల పాటు కొనసాగిన కొండా సిద్ధార్థ్‌ కుటుంబాన్ని జననేత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో త‌గిన గుర్తింపు ఇస్తామ‌ని చెప్పారు. ఈ ప‌రిణామంతో బాబు సొంత జల్లాలోనే ప‌రిస్తితి అన‌నుకూలంగా మారుతుండ‌డంపై టీడీపీ నాయ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: