మఘా కార్తె మొక్కజొన్న పంటలను పగ బట్టింది. కంకితొడిగే పరిస్థితుల్లో మొక్కజొన్న పంటలకు వర్షాలు లేక ఎండుముఖం పట్టాయి. పూర్వం నుండి మొక్కజొన్న పంటలను సాగు చేసిన రైతులు మఘా కార్తె పంటలను ఏం చేస్తుందోనని అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే గతంలో మఘా కార్తె లో రైతులు అనభవించిన బాధలు, కార్తెలో వర్షాలు కురియక ఎన్నోసార్లు పంటలు ఎండిపోయిన సంఘటనలు ఉన్నందునే మఘా మొక్కజొన్నకు పగ అని కూడా రైతులు అంటుంటారు. కేవలం వర్షాధారం పై ఆదారపడి రైతులు ఖరీఫ్ సీజన్ లో వివిధ రకాల ఆరుతడి పంటలను సాగుచేయడం జరుగుతుంటుంది. వర్షాకాలం ప్రారంభంలో మొక్కజొన్న పంటలను సాగు చేస్తే మఘా కార్తె ప్రవేశించే వరకు మొక్కజొన్న పంట తలసుంచు ధశకు రావడం, మరికొంచెం ముందు విత్తనాలు వేస్తే పీచులు తొడిగే ధశలో ఉంటుంది. కాగా అదేమిటోగాని మఘా కార్తె ప్రవేశించిందనగానే రైతుల్లో ఆందోళన ప్రారంభమవుతుంది. గతంలో చాలా సార్లు మఘా కార్తె లో వర్షాలు లేక మొక్కజొన్న పంటలు ఎండిపోయి పశువులకు మేతగా మారినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాగా అటువంటి పరిస్థితి ఇప్పుడు వస్తుందేమోననే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మఘా కార్తె ప్రవేశం ఈ నెల 17న జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో వర్షాలు కురియలేదు. దీంతో పంటలన్ని ఎండిపోతున్నాయి. అనేక మంది రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ యూరియాను తీసుకొచ్చి పంటలకు వేయడం కోసం సిద్దంగా ఉంచుకున్నారు. ఇటువంటి పరిస్థితిలో వర్షాలు కురియక పోవడంతో కొంత మంది రైతులు మొక్క జొన్న పంటలకు యూరియా వేయలేదు. మరి కొంత మంది రైతులు వేసినప్పటికి వర్షాలు కురియక పంటలు ఎండిపోతున్నాయి. అయితే మఘా కార్తె ఈ నెల 30న తెల్లవారుజామున వెళ్లిపోతుంది. కాగా కార్తె అయిపోయేంత వరకు వర్షాలు కురియక పోతే వర్షాధారంపై ఆదారపడిన ఏ ఒక్క మొక్కజొన్న పంట సైతం దక్కే అవకాశం లేదు. ఇప్పుడున్నటు వంటి పరిస్థితుల్లో రైతులు మబ్బులు రాగానే ఆశ పడుతున్నారు, మబ్బులు తేలిపోగానే నిరాశకు గురవుతున్నారు. ఇలా ఆశ, నిరాశల మద్యన రైతులు జీవనం సాగించుకుంటూ, ఎప్పుడు వర్షాలు కురుస్తాయా అంటూ ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: