హైదరాబాద్: ‘ ప్రతి మగవాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు’. ఇది మరోసారి రుజువైంది. ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల విజయం వెనుక కూడా ఇద్దరు మహిళలు ఉన్నారు. ఎన్నికల సందర్భంగా వారిద్దరు పోషించిన పాత్ర రాష్ర్ట రాజకీయాలలోనే పెను మార్పులు తీసుకు వచ్చే విధంగా ఉన్నాయి. రాజకీయాల్లో దశబ్దాల తరబడిగా ఉన్న హేమాహేమీలను ఓడించారు. వారి అంచనాలను తలకిందులు చేశారు. జాతకాలను మార్చేశారు. ఇప్పుడు అందరూ ఆ ఇద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. వారే....శ్రీమతి వైఎస్.విజయమ్మ, ఆమె కూతురు షర్మిల. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గత డిసెంబర్లో ప్రభుత్వంపై టీడీపీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా జగన్ వర్గీయులు 17మంది శాసనసభ్యులు ఓట్లు వేశారు. దీనితో వీరు అనర్హతకు గురయ్యారు. దీనితో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఉప ఎన్నికల్లో జగన్ కు జనం అండ వుందనుకుని, ఎలాగైనా జగన్ను నిలువరించాలనే లక్ష్యంతో ఉప ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళ సీబీఐని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ అక్రమ ఆస్తుల కేసులో గత నెల 27న అరెస్టు చేయించి, జైలుకు పంపింది. ప్రచార సమయంలో జగన్ ను జైలుకు పంపడంతో ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అనూహ్యమైన పరిస్థితుల్లో ప్రచార బాధ్యతలను చేపట్టారు. అన్నీ తామై ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలన్నింటిని తిరిగారు. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ ఆ తల్లీకూతుర్లు ఎన్నడూ బయటకు వచ్చింది లేదు. కానీ, ఉప ఎన్నికల వేళ తప్పని సరి రావల్సి వచ్చింది. ఈ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయి. తమ కుటుంబాన్ని కాంగ్రెస్, టీడీపీ కలిసి ఎలా వేధిస్తున్నాయి. తన కొడుకును జగన్ ను జైలుకు పంపిన విషయమై ప్రజలకు వారిద్దరు పూసగుచ్చినట్లు చెప్పారు. తన భర్త రాజశేఖర్ రెడ్డి మరణం పట్ల అనేక అనుమానాలున్నాయంటూ ప్రచారంలోకి దిగారు. వారి సభలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. వారిద్దర్ని ప్రజలు ఎంతగానో ఆదరించారు. ఆశీర్వదించారు. వీటిని కాంగ్రెస్, టీడీపీ పెద్దగా పట్టించుకోలేదు. ప్రజలు వచ్చినంత మాత్రన ఓట్లు వస్తాయా అన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తరుపున గులాంనబీఅజాద్, ఆస్కార్ ఫెర్నాండెజ్, వాయిలార్ రవి, సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహా, పురుందేశ్వరీ, పనబాక లక్ష్మి, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాత్రింబవళ్లు పనిచేశారు. కాంగ్రెస్ కు చెందిన ఉద్దండులైన ఆజాద్, రవి వంటి వాళ్లు జగన్ అవినీతి పరుడంటూ ప్రచారం చేశారు. టీడీపీ అధికార పార్టీని వదిలి జగన్ ను టార్గెట్గా ప్రచారం చేసింది. వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలోని అతిరథమహారథులందరూ ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ తరుపున విజయమ్మ, షర్మిల మాత్రమే ప్రచారాన్ని నిర్వహించారు. 18అసెంబ్లీ స్థానాలకు గానూ పదహారింటితో పాటు పార్లమెంటునూ కైవసం చేసుకుంది. తెలంగాణలోని పరకాలలో టీఆర్ఎస్-వైఎస్ఆర్ మధ్యనే హోరాహోరీ పోటీ జరిగింది. కొండా సురేఖ గట్టి పోటీ ఇచ్చింది. చివరి రౌండ్ వరకూ నువ్వా, నేనా అనే విధంగానే జరిగింది. మిగతా అన్ని స్థానాలలోనూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల అడ్రస్ గల్లంతు చేశారు. వైకాపా అభ్యర్థుల గెలుపు వెనుక విజయమ్మ, షర్మిల శ్రమ ఎంతగానో వుంది. మొత్తానికి మరోమారు మహిళ తమ సత్తాను చాటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: