ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు.. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు సర్కారు పనితీరుపై విమర్శలు గుప్పించారు. విలువలు పాటించకుండా పార్టీ ఫిరాయింలను ప్రోత్సహిస్తూ చంద్రబాబు పాలన సాగించిన తీరును తీవ్రంగా విమర్శించారు. ప్రత్యేకించి గిద్దలూరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తన ప్రసంగం ద్వారా శాసనసభను అకట్టుకున్నారు. ఫిరాయింపుల మీద శాసనసభ తీర్మానం చేయాలని ఆయన కోరారు.
గత ప్రభుత్వంలో రాజ్యాంగ విరుద్దంగా ఫిరాయింపులను ప్రోత్సహించిన చంద్రబాబు రాజకీయాలకు అనర్హుడని, ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాంబాబు డిమాండ్ చేశారు.తాను ఈ విషయంలో చంద్రబాబు ఇంటి ముందు దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. రాజకీయాలను బ్రష్టు పట్టించిన చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని, అప్పుడు తాను కూడా రాజకీయాల నుంచి విరమించుకుంటానని ఆయన చెప్పారు.
చంద్రబాబును నమ్మి మోసపోయిన వారిలో తాను ఒకడినని అన్నా రాంబాబు చెప్పారు. వందల కోట్ల రూపాయలు వెచ్చించి శాసనసభ్యులను చంద్రబాబు కొన్నాడంటే అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది.. ఆ డబ్బు అవినీతి డబ్బు కాదా అని ప్రశ్నించారు. వెలుగొండ ప్రాజెక్టు రెంటు టన్నెల్స్ ఉన్నాయని, మొదట్లో వేసే బోర్ లోపలికి వెళ్లే కొద్ది లైనింగ్ చేయడం వల్ల వైశాల్యం తగ్గుతుందని, ఆ పనులు చేసే ఇద్దరు కాంట్రాక్టర్లను క్యాన్సిల్ చేసి రూ. 600 కోట్లు ఉంటే.. తదుపరి టెండర్లు రూ. 16 వందల కోట్లకు పిలిచారన్నారు.
అవినీతి సొమ్ముతో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, దానికి తానే సాక్షమన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చంద్రబాబు శాసనసభలో కూర్చోవడానికి అనర్హుడన్నారు. సిగ్గు, ఎగ్గూ లేకుండా చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత స్పీకర్ కోడెల ఏకవ్యక్తి పాలన నిర్ణయాలకు తాబేదారుడిగా వ్యవహరించారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన వారిపై వెంటనే అనర్హత వేటు పడేలా చట్ట సవరణ చేసి పార్లమెంట్‌కు నివేదించాల్సిందిగా స్పీకర్‌ను కోరారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి