హైదరాబాద్: వైఎస్ఆర్ పార్టీ జగన్ ముందు ఇప్పుడు మరో పెద్ద సమస్య వచ్చింది. త్వరలో జరగనున్న రాష్ర్టపతి ఎన్నికల్లో జగన్ యూపీఏకు మద్దతు పలుకుతాడా? లేక ఎన్డీయే నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇస్తాడా?అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పుడు ఎక్కడా చూసినా, ఏ రాజకీయ నాయకుడిని పలుకరించినా అందరి నోట ఒక్కటే. రాష్ర్టపతి ఎన్నికల్లో జగన్ పాత్ర ఏమిటి? ఆయన వ్యూహం ఏమిటి? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రాష్ర్టపతి ఎన్నికల్లో జగన్ వేసే అడుగుపై ఆయన రాజకీయ చతురత ఆధారపడి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఏ పార్టీకి మొగ్గు చూపుతారా? తటస్థంగా ఉంటాడా? అనేది అందరి తొలుస్తున్న ప్రశ్న. తాజాగా వైఎస్ఆర్ గెలిచిన 15మంది శాసనసభ్యులు, నెల్లూరు పార్లమెంటు సభ్యుడితో పాటు రాష్ర్ట అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల సంఖ్య 17, పార్లమెంటులో వారి బలం రెండుకు చేరుకుంది. రాష్ర్టపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీ మొత్తం ఓట్లు దాదాపుగా 11లక్షలు. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేల, ఎంపీల సంఖ్య ప్రకారం సుమారుగా 4వేలుగా ఉంటుందని అంచనా. ఇదిలా ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ యూపీఏ అభ్యర్థిగా కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని ప్రకటించింది. అభ్యర్థిని ప్రకటించిన మరుక్షణమే అటు సోనియా, ఇటు ప్రధాని మన్మోహన్ రంగంలోకి దిగారు. యూపీఏ భాగస్వామ్య పక్షాల పార్టీలతో పాటు ఇతర పార్టీల నాయకులకు కూడా ఫోన్లు చేస్తున్నారు. ప్రణబ్కు మద్దతు తెలుపాల్సిందిగా కోరుతున్నారు. ప్రధాని మరో అడుగు ముందుకు వేసి బీజేపీ, టీడీపీ అగ్రనేతలకు ఫోన్లు వేసి తమ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలియచేయాల్సిందిగా కోరారు. టీడీపీ మద్దతు కోరిన ప్రధాని వైకాపా మద్దతు కోరబోరని చెప్పలేం. కాంగ్రెస్లోని కొందరికీ ఇప్పటికీ జగన్  శిబిరంతో టచ్ లోనే ఉన్నట్లు సమాచారం.  రాష్ర్టపతి ఎన్నికను యూపీఏ ప్రతిష్టగా తీసుకుంది.ఈ తరుణంలో కాంగ్రెస్కు అన్ని పార్టీల అవసరం వుందని చెప్పాలి. ఇప్పటికే ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి జగన్ తనకు మద్దతు చేయాల్సిందిగా కోరారు. దీనిపై పార్టీలో లోతుగా చర్చిస్తున్నారు. బీజేపీ నేత్రుత్వంలోని ఏన్డీయే అభ్యర్థిని ప్రకటించేందుకు ఆదివారం నాడు భేటీ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి దాదాపుగా రాష్ర్టపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా పావులు కదుపుతోంది. అయితే, ఎన్డీయే అభ్యర్థిని పోటీ పెట్టాలనే దానికి కట్టుబడి వుంది. ఈ క్రమంలో జగన్ అవసరం, ఆయన పాత్రీ క్రీయాశీలకంగా ఉంటుందనే చెప్పాలి. జగన్ మద్దతుపై తలోమాదిరిగా చర్చించుకుంటున్నారు. జగన్ అరెస్టు కాకముందు ఒకానొక సందర్భంలో తాను కేంద్ర స్థాయిలో బీజేపీకి దూరంగా ఉంటామనీ, అవసరమైతే యూపీఏకు మద్దతు ఇవ్వడంలో వెనకాడబోనని ప్రకటించారు. ఇప్పుడు అందరూ ఆనాటి జగన్ టీవీ ఇంటర్యూను గుర్తు చేస్తున్నారు. బీజేపీకి దూరమని స్సష్టంగా ప్రకటించడంతో ఎన్డీయే అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోడని స్పష్టం. ఇక మిగిలింది యూపీఏ అభ్యర్థి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనను కావాలనే కాంగ్రెస్ వేధిస్తుందనీ, కక్షసాధింపులో భాగంగానే జైలుకు పంపిందనీ, ఇదే ప్రధానంశంగా వైకాపా ఎన్నికల్లో ప్రచారం చేసింది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేసి, ప్రజల మద్దతును కూడబెట్టుకున్న వైకాపా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అంత తేలిగ్గా మద్దతు ఇస్తుందని అనుకోవడం కూడా పొరపాటే. దీంతో రాష్ర్టపతి అభ్యర్థి విషయంలో వైకాపా తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. యూపీఏకు మద్దతిస్తారా? ఎన్డీయేకు మద్దతు ఇస్తారా? లేక తటస్థంగా ఉంటారా? ఏం చేయబోతున్నరో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా రాష్ర్టపతి ఎన్నికల్లో వైకాపా తీసుకునే నిర్ణయంతో త్వరలో ఆ పార్టీ కేంద్రంలో ఎలా ఉండబోతోందో తేలిపోనున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: