సీఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో అతలాకుతలమైన దేశ రాజధాని ఢిల్లీ... ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటుండగా.. అల్లర్లలో మృతుల సంఖ్య 47కు చేరింది. కాగా ఈ ఘర్షణలపై ఇంటలిజెన్స్‌ విభాగం రూపొందించిన నివేదిక.. సంచలన విషయాలు బయటపెట్టింది.  

 

ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 47కు పెరిగింది. నాలుగురోజుల పాటు ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండలో గాయపడిన 200 మందికిపైగా బాధితులు.. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, గురుతేజ్ బహదూర్ ఆసుపత్రిలో 38 మంది, లోక్ నాయక్ ఆసుపత్రిలో ముగ్గురు, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఐదుగురు, జగ్ ప్రవేశ్ చందర్ ఆసుపత్రిలో ఒకరు.. చికిత్స పొందుతూ చనిపోయారు. 

 

ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఇప్పటికే సిట్‌ దర్యాప్తు జరుపుతుండగా... ఇంటలిజెన్స్‌ విభాగం ఇచ్చిన నివేదిక సంచలన విషయాల్ని బయటపెట్టింది. ఈ అల్లర్లలో హైదరాబాద్ విద్యార్థుల పాత్ర ఉన్నట్టు నివేదికలో చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన కొందరు విద్యార్థులు సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేయడం ద్వారా ఢిల్లీలో అల్లర్లకు ఆజ్యం పోశారంటూ.. కేంద్ర హోంమంత్రిత్వశాఖకు సమర్పించిన రహస్య నివేదికలో ఇంటలిజెన్స్‌ విభాగం వెల్లడించినట్టు తెలుస్తోంది.  వదంతులు, తప్పుడు మెసేజ్ ల వల్లే అల్లర్లలో హింస చెలరేగడానికి కారణమని తేల్చింది.

 

ఢిల్లీ ఘర్షణలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. కాగా, ఈ అల్లర్లు పక్కా ప్లాన్‌ ప్రకారమే జరిగాయని తృణముల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఆరోపించారు. కోల్‌కతాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె...  కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబాల కోసం విరాళాలు సేకరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

 

కాగా ఈ హింసాకాండకు సంబంధించి 254 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు 903 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయుధాల చట్టం కింద 41 మందిపై కేసులు పెట్టినట్టు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రశాంతంగా ఉందని, ప్రజలు తమతమ పనుల్లో బిజీగా అయిపోయారని ఢిల్లీ పోలీసు అధికారులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: