భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి 22వ తేదీ నుండి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ పేద ప్రజలకు కరోనా వైరస్ కంటే ఎక్కువ ప్రాణాంతకంగా మారింది. పని చేస్తే కానీ డబ్బులు మిగిలని కొన్ని లక్షల మంది ప్రస్తుతం ఉపవాసాలు ఉంటున్నారు. నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉపశమన ప్యాకేజీ ద్వారా నెలకి 5 కిలోల గోధుమపిండి వస్తుందట. అవి కొంతమంది వెనుకబడిన వర్గాల యొక్క పెద్ద కుటుంబాలకు కనీసం 4 రోజులకి కూడా సరిపోవు. అయినా అవి ప్రజలకు అందే సరికి చాలా రోజులు కూడా పట్టవచ్చు. అప్పటివరకు రోజు కూలి చేసేవారు ఆకలితో అలమటించాల్సిందే. ఈ క్రమంలోనే ఒక మహాదళిత కుటుంబీకులు ఆకలితో తట్టుకోలేక గడ్డి తింటున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.




వివరాలు తెలుసుకుంటే... నరేంద్ర మోడీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్ లోని వారణాసి జిల్లా బారగావ్ బ్లాకులోని కొయిరిపూర్ గ్రామంలో మహా దళితులుగా పిలవబడే కొన్ని ముసాహర్ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ కుటుంబాలు తమ వద్ద ఏ సరుకులు లేనప్పుడు... ఎలుకలను తిని జీవిస్తుంటారు. అందుకే వారికి 'ముసాహర్' అనే పేరు వచ్చింది. ఐతే సామాజికంగా, ఆర్థికంగా బాగా వెనుకబడిన ఈ కుటుంబాలకు లాక్ డౌన్ కారణంగా ఏ కూలి పనులు గత రెండు రోజులుగా దొరకడం లేదు. దాంతో బియ్యం, సరుకులు కొనుక్కోవడానికి చేతిలో చిల్లిగవ్వ లేక మరోవైపు ఆకలికి తట్టుకోలేక దొరికిన పచ్చి గడ్డిలో కాస్త ఉప్పు, కారం వేసుకొని తింటున్నారు ఈ కుటుంబీకులు.





ఐతే ఈ వార్తని పక్క ఆధారాలతో ప్రచురించింది జనసందేశ్ టైం అనే ఓ ప్రముఖ స్థానిక వార్తా సంస్థ. పిల్లలు గడ్డి తింటున్న ఫోటో తో ఈ వార్త కథనాన్ని జనసందేశ్ టైం ఎడిటర్ విజయ్ వినీత్, రిపోర్టర్ మనీష్ మనీష్ మిశ్రా కలిసి 26వ తేదీన ప్రచురించారు. అది చదివిన ఆన్లైన్, ఆఫ్ లైన్ పాఠకులు అంతా 'మీ సర్కార్ లో ఇన్ని దారుణాలు జరుగుతుంటే అస్సలు పట్టించుకోట్లేదు. నువ్వేం ప్రధానివయ్యా? అంటూ తిట్టి పోశారు. మరోవైపు వారణాశి జిల్లా కలెక్టర్(district magistrate) కౌశల్ రాజ్ శర్మ కి కూడా పరువు పోయినట్టు అనిపించింది. వెంటనే కొంతమంది పోలీసులతో ఈ వార్తను ప్రచురించిన వారి ఇంటికి ఓ నోటీసును పంపించి ఈ వార్తపై 24 గంటల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించాడు.




ఇంతకీ ఆ నోటీసు లో ఏముందంటే... 'మేము ఒక పరిశోధనా బృందాన్ని ఏర్పాటు చేశాం. ఆ బృందం... పిల్లలు తింటున్న గడ్డి నమూనాలను సేకరించి పరీక్షించింది. ఆ పరీక్షలో ఆ గడ్డి కి గింజలు ఉంటాయని... ఆ గింజలు ఆఖరీ దాల్ అనే ఓ పప్పుజాతికి చెందినవని తెలిసింది. ఈ గడ్డి కలుపు తరహాలో గోధుమ పంటల్లోని మొక్కల మధ్యలో మొలుస్తుంది. ఇవి తింటే ప్రమాదకరం కాదు. మీరు ఇవన్నీ తెలుసుకోకుండా ఈ వార్త రాసినందుకు మీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు?' అనే రాతలతో పాటు ఆ కలెక్టర్ తన కుమారుడితో కలిసి గడ్డి తింటున్నట్టు గా ఓ ఫోటో కూడా ఉంది.




అయితే ఈ నోటీసుకు వివరణగా... ' నేను బనారస్ హిందూ యూనివర్సిటీ కు చెందిన అగ్రికల్చర్ నిపుణులతో మాట్లాడాను. వాళ్ళు ఈ గడ్డి కానీ వాటి గింజలు కానీ మనుషులు తినకూడదని చెప్పారు. ఒకవేళ పశువులు తింటే వాటికి రక్త విరోచనాలు అవుతాయని చెప్పారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఈ వార్తను ప్రచురించాము' అని ఎడిటర్ వినయ్ వినీత్ చెప్పాడు.




ఇకపోతే ముసాహర్ కుటుంబాల సమస్యలపై పోరాడుతున్న ఓ రెడ్ బ్రిగేడ్ ట్రస్ట్ చైర్మన్ అజయ్ పటేల్... వారణాసి జిల్లా కలెక్టర్ తీరు పై మండిపడ్డారు. 'గత రెండు రోజులుగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఎన్నో కుటుంబాలు ఆకలితో బాధపడుతున్నారు. రేషన్ సరకులు కూడా ఒక్కోసారి వారికి దొరకవు. మంచి నీళ్లు కూడా తాగనివ్వరు సమీప ప్రాంత ప్రజలు. ఒకసారి మీరే వచ్చి చూడండి. అంతేకాని ప్రాణాంతకమైన గడ్డి తింటే ఏమి కాదు అంటూ మీ కొడుకుతో తినిపించకండి', అని ఆయనన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: