దేశంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వల్ల దేశంలోని అన్ని రంగాలు దెబ్బ తింటున్నాయి. కరోనా ప్రభావం వ్యవసాయ రంగంపై కూడా పడింది. ఊహించని ఈ ఉపద్రవం ఉల్లి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. గతేడాది ధరలు పెరగడంతో అంతోఇంతో లాభాలను కళ్లజూసిన రైతులు లాక్ డౌన్ ప్రభావంతో ఈ సంవత్సరం నష్టాలు తప్పవని లబోదిబోమంటున్నారు. 
 
ఆరుగాలం శ్రమించి పంట పండించిన ఉల్లి రైతులు పంట బాగానే పండినా అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. లాక్ డౌన్ వల్ల పలు జిల్లాలలో మార్కెట్ యార్డులు మూతబడ్డాయి. ఖరీఫ్ సీజన్ లో క్వింటా ఉల్లి ధర 14,000 రూపాయలు పలికింది. ఉల్లి సాగు చేస్తే కష్టాల నుంచి గట్టెక్కుతామని భావించి రైతులు ఉల్లి పంట వేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో పంట చేతికి వచ్చినా అమ్ముకునే పరిస్థితి లేదు. 
 
కొన్ని జిల్లాలలో మార్కెట్ యార్డులు తెరిచి ఉన్నప్పటికీ వారం రోజుల క్రితం క్వింటా 3,000 రూపాయలు పలికిన ఉల్లి ప్రస్తుతం 800 రూపాయలు పలుకుతూ ఉండటంతో రైతులు నష్టానికే పంటను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రబీ సీజన్లో కర్నూలు జిల్లాలో దాదాపు 4,000 హెక్టార్లలో ఉల్లి పంటను సాగు చేశారు. 
 
రైతులు ఎకరాకు 60,000 రూపాయల పెట్టుబడి పెట్టగా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం అమ్మితే అందులో సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం ఉల్లి రైతుల బాధను అర్థం చేసుకుని మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ లో వ్యాపారులు కిలో ఉల్లిని 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గిట్టుబాటు ధర కల్పించి పంటలను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం కూడా అదే విధంగా చేయాలని రైతులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: