కరోనా సమయంలో ప్రజల్లో అవగాహన కలిగించేందుకు.. కరోనాపై పోరాటంలో స్ఫూర్తి నింపేందుకు అనేక మంది కవులు, కళాకారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కోవలోనే ప్రసిద్ధ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ కూడా ఓ పాట రాశారు. ఎవ్వతిరా ఇది ఎవ్వతిరా ఈ కరోన రక్కసి ఎవ్వతిరా... అనే ఆ పాట పలువురు ప్రశంసలు అందుకుంది.

 

 

అయితే ఈ పాటలో కరోనాను స్త్రీగా పోల్చి రాయడంపై ఎవ్వతిరా అని పరుషంగా రాయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో సుద్దాల అశోక్ తేజ స్పందించారు. కరోనాను స్త్రీగా పోలుస్తూ ఎవ్వతిరా అని రాయడంపై ఆయన మహిళాలోకానికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. యక్షగాన రీతిలో భావోద్వేగంగా రాసే క్రమంలో ఆ పదాలు పడ్డాయని.. అయినా అది తప్పేనని ఆయన అన్నారు. దీని వల్ల మహిళలు ఎవరైనా నొచ్చుకున్నా.. నొచ్చుకోకపోయినా తాను క్షమాపణలు చెబుతున్నానన్నారు.

 

డా. సుద్దాల అశోక్‌ తేజ రాసిన కరోనా గీతం ఇదీ..

 

ఎవ్వతిరా ఇది ఎవ్వతిరా

ఈ కరోన రక్కసి ఎవ్వతిరా

ఎంతదిరా ఇది ఎంతదిరా

మన సంకల్పం ముందెంతదిరా||2

కేంద్ర రాష్ట్ర సర్కార్ల అండతో

ఢీ అంటూ జేగంటలు కొడతాం

తమసోమా జ్యోతిర్గమయంటూ

దీపమెట్టి వైరస్ తరిమేస్తాం..

 

॥ఎవ్వతిరా॥

॥చరణం1

అవ్వతోడు తెగ కొవ్వు బలిసి ఇది

తొవ్వ తప్పి మువ్వన్నెల జెండా

యవ్వన భూజన ప్రాణదివ్వెలతో

గవ్వలాడుటకు కాలు దువ్వినది

॥గవ్వలాడుటకు కాలు దువ్వినది॥2

చెయ్యి కలిపితే దయ్యమౌతది

నోటి తుంపరతో అంటుకుంటది

భయ్యా.. అరె భయ్యా

అరె భయ్య దీన్ని మసి చెయ్యాలంటే

చెయ్యి కలపగనె ఒక్కతాటిపై

నమస్కారమనె కత్తితో కరోన

గొంతు కొయ్యవలె అంతు చూడవలె

గొంతు కొయ్యవలె అంతు చూడవలె

!!ఎవ్వతిరా॥

 

॥చరణం2

గడప దాటక ఉండి కరోనా

గండానికి ఇక పిండం పెడుతాం

గజం గజం దూరం పాటిస్తూ

కరోనాతో వంతెన తెగ్గొడతాం

మనలో మనకు జబ్బున్దని తెలిస్తే

నూట నాలుగుకు ఫోన్ కొట్టుదాం

క్వారంటైనుకు వెళ్లి భారత

జాతి ఆయుష్షుకు గ్యారెంటిస్తాం

ప్లేగు పేగు తెంపేసిన ఘనులం

గత్తరను తొడగొట్టి తరిమినం

మతభేదాలనూ............

మతభేదాలను విడిచి కరోనను

ఖతంచేసి దుర్గతిని బాపుతం..

||ఎవ్వతిరా||

 

॥చరణం3

తమ ప్రాణాలను గడ్డిపోచ వలె

భావించే వైద్యులకు నర్సులకు

ఆలుబిడ్డలను మరచి సేవలో

అలుపెరుగని పోలీసు బిడ్డలకు

మురికిలోన మురికి అయ్యి బతుకులను

ఫణం పెట్టె మన సఫాయోళ్ళకి

నిరంతరం.. చైతన్య పరిచే

ప్రెస్ మీడియా మార్గదర్శులకు

ప్రణామంగా పాదాలు తాకుతాం...

సరిహద్దుల్లో మన సైనికులోలే

కరోన శత్రువుతో యుద్ధం చేసే

మన అత్యవసర సేవకులందరి

అండ దండలతో క్రమశిక్షణతో

కరోనాను దునుమాడి తీరుతాం

||ఎవ్వతిరా||

మరింత సమాచారం తెలుసుకోండి: