ఆర్బీఐ దేశంలోని ఉద్దేశపూర్వక ఎగవేతదారుల రుణాలను రద్దు చేసిందని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. బీజేపీ సన్నిహితులే డిఫాల్టర్ల జాబితాలో ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాను ఇదే అంశం గురించి పార్లమెంట్ లో ప్రశ్నించినా బీజేపీ నుంచి సరైన సమాధానం రాలేదని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిర్మలమ్మ స్పందించారు. 
 
రాహుల్ ఆరోపణలపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలలో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు. ప్రజలను రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నాడని.... ఆధారాలు లేకుండా రాహుల్ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పారు. రాహుల్ గాంధీకి మొండి బకాయిల రైటాఫ్ గురించి తెలుసని తాను అనుకుంటున్నానని... రాహుల్ కు తెలియకపోతే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను అడిగి తెలుసుకోవచ్చని అన్నారు. 
 
మొండి బకాయిలకు కేటాయింపులు ఆర్బీఐ నిర్దేశించిన నాలుగేళ్ల ప్రొవిజనింగ్ చక్రం ప్రకారం జరిగాయని చెప్పారు. బ్యాంకులు పూర్తి కేటాయింపుల తరువాత మాత్రమే ఎన్‌పీఏలను రైటాఫ్ చేస్తాయని ఆమె పేర్కొన్నారు. రుణం మాఫీ కాదని... బ్యాంకులు లోను తీసుకున్నవారి దగ్గరినుంచి రుణం రికవరీని కొనసాగిస్తాయని తెలిపారు. నిర్మలమ్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాహుల్ ను విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. 
 
విజయ్ మాల్యా , మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీకి సంబంధించిన 18,332 కోట్ల ఆస్తులను జప్తు చేశామని .... ఎవరైతే చెల్లించగలిగే సామర్థ్యం ఉండి రుణాలు చెల్లించరో వారిని ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా పరిగణిస్తారని అన్నారు. ఆర్‌టీఐ కార్యకర్త సాకేత్‌ గోఖలే ఫిబ్రవరి 16న ఎగవేతదారుల వివరాల కోసం దరఖాస్తు చేయగా ఆర్బీఐ ఆ లేఖకు ఏప్రిల్ 24న రాతపూర్వక సమాధానం ఇచ్చింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: