దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ అన్ని రంగాల్లో పెను మార్పులు తీసుకొస్తోంది. కరోనా వైరస్ విజృంభణ వల్ల విద్యావ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయి. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ లేకపోవడంతో స్వీయ నియంత్రణ ద్వారా మాత్రమే కరోనాను కట్టడి చేయడం సాధ్యమవుతోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా పాఠాలు అందించనుంది. 
 
యూట్యూబ్ ఛానల్ ద్వారా, ప్రభుత్వ ఛానల్ టీశాట్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోందని... విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కమిషనర్ జలీల్ సూచిస్తున్నారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌తో ఈ విషయం గురించి ప్రధానంగా కమిషనర్ చర్చించనున్నారు. ఇంటర్ మూల్యాంకనం, ఫలితాల వెల్లడి, కళాశాలల పునః ప్రారంభంపై గురించి కూడా సమీక్ష జరగనుందని తెలుస్తోంది. 
 
రాబోయే రెండు మూడు రోజుల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కానుంది. ఒకేరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. కళాశాలల పునః ప్రారంభం గురించి ఇంటర్ బోర్డు అధికారులు, ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకురాలు శేషుకుమారి, పాఠశాల విద్యాశాఖ మాజీ అదనపు సంచాలకుడు గోపాల్ రెడ్డి తదితరులతో నియమించిన కమిటీ మరో మూడు రోజుల్లో నివేదిక అందించనుంది. 
 
ఇంటర్ ద్వితీయ సంవత్సరం క్లాసులు జులై నెలలో ప్రారంభమవుతాయని... మొదటి సంవత్సరం క్లాసులు ఆగష్టు మొదటి వారంలో ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో జూన్ 8వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి వచ్చేలా అధికారులు షెడ్యూల్ ను రూపొందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: